విజయకుమారి గుర్తింపుకార్డు,
అగ్ని ప్రమాదంలో ఓ స్వచ్ఛంద మహిళా ఆరోగ్య కార్యకర్త సజీవ దహనమైంది. ఈ విషాద సంఘటన బుధవారం మధ్యాహ్నం కలకడ మండలంలో జరిగింది.
–వంట చేస్తుండగా మూర్చ
–సహ కోల్పోయిన మహిళ
–కిందపడగానే తాకిన స్టౌ మంట
–అగ్నికీలలకు ఆహుతి
కలకడ: అగ్ని ప్రమాదంలో ఓ స్వచ్ఛంద మహిళా ఆరోగ్య కార్యకర్త సజీవ దహనమైంది. ఈ విషాద సంఘటన బుధవారం మధ్యాహ్నం కలకడ మండలంలో జరిగింది. ఎస్‌ఐ చాన్‌బాషా కథనం మేరకు వివరాలిలా .. కలకడ మండలం బాలయ్యగారిపల్లె పంచాయతీ యర్రయ్యగారిపల్లె ఇందిరమ్మ కాలనీ(చర్చివద్ద)లో ఉంటున్న శివయ్య భార్య యం.విజయకుమారి(36)కి మూర్చ వ్యాధి ఉంది. 15 సంవత్సరాల క్రితం భర్త శివయ్య ఈమెను వదిలిపెట్టాడు. ఇంటర్మీడియట్ చదువుతున్న కుమారుడున్నాడు. ఆరోగ్య కార్యకర్తగా పనిచేస్తున్న విజయకుమారి గతంలో పలు పర్యాయాలు ఈ వ్యాధితో కింద పడిపోతే చుట్టు పక్కలవారు, కుమారుడు రక్షించారు. బుధవారం మధ్యాహ్నం కుమారుడు లక్ష్మీనారాయణ కళాశాలకు వెళ్లాడు. అదే సమయంలో విజయకుమారి కిరోసిన్ ఆయిల్ స్టౌపై వంట చేస్తోంది. ఉన్నట్టుంది మూర్చ వచ్చి వెంటనే స్పృహ లేకుండా పడిపోయింది. స్టౌలోని కిరోసిన్ మంటలు ఆమెకు తాకాయి. మంటలెగిసి ఇంట్లో వస్తువులకూ అంటుకున్నాయి. కాలనీలో పెద్దగా జనసంచారం లేకపోవడంతో ఎవరూ గమనించలేదు. దీంతో విజయకుమారి మంటల్లో కాలిపోయింది. సమీపంలో కుక్కలు గట్టిగా అరుస్తుంటే కొందరు వచ్చి∙పరిశీలించారు. కలకడ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.