కల్తీ కారంపై ఉక్కుపాదం | Heavy hand on duplicate mirchi powder | Sakshi
Sakshi News home page

కల్తీ కారంపై ఉక్కుపాదం

Apr 15 2017 9:34 PM | Updated on Sep 5 2017 8:51 AM

కల్తీ కారం తయారీ, విక్రయదారులపై ఉక్కుపాదం మోపుతామని గుంటూరు మార్కెట్‌ యార్డు చైర్మన్‌ మన్నవ సుబ్బారావు హెచ్చరించారు.

► 11 లైసెన్సులు రద్దు
► గుంటూరు మార్కెట్‌ యార్డు చైర్మన్‌ మన్నవ


కొరిటెపాడు(గుంటూరు): కల్తీ కారం తయారీ, విక్రయదారులపై ఉక్కుపాదం మోపుతామని గుంటూరు మార్కెట్‌ యార్డు చైర్మన్‌ మన్నవ సుబ్బారావు హెచ్చరించారు. యార్డు పరిపాలనా కార్యాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వార్థం కోసం ప్రజల జీవితాలతో చెలగాటం ఆడవద్దని హెచ్చరించారు. గత నవంబర్‌లో కోల్డ్‌ స్టోరేజీలు, కల్తీ కారం మిల్లులపై నిర్వహించిన ఆకస్మిక దాడుల్లో 25 వేల కల్తీకారం బస్తాలను స్వాధీనం చేసుకుని సీజ్‌ చేసి 97 శాంపిల్స్‌ తీసి ల్యాబ్‌కు పంపగా వాటిలో సుమారు 58 సురక్షితం కాని, ప్రమాణాలు లేనివిగా నివేదికలు వచ్చాయని వివరించారు. మొత్తం 40 మిల్లుల్లో కల్తీ కారం ఉన్నట్లు నిర్ధారణ అయిందన్నారు. వాటిలో 11 మిల్లులకు లైసెన్సులు ఉన్నాయని, మిగిలిన 29 మిల్లులకు లైసెన్సులు లేవని, లైసెన్సులు ఉండి కల్తీ కారం తయారు చేసిన 11 మిల్లుల లైసెన్సులను రద్దు చేసినట్లు చెప్పారు. లైసెన్సులు లేకుండా వ్యాపారం చేస్తున్న మిల్లులపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు సిఫారసు చేస్తున్నామన్నారు.

పుడ్‌ అండ్‌ సేఫ్టీ అధికారి పూర్ణచంద్రరావు మాట్లాడుతూ వీరందరిపై చట్టప్రకారం క్రిమినల్‌ కేసులు పెట్టనున్నట్టు తెలిపారు. కల్తీకి పాల్పడినట్లు తేలితే శాశ్వతంగా వ్యాపారం చేయకుండా అన్ని లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. సత్యనారాయణ-రమేష్‌కుమార్‌ అండ్‌ కో, రమా సత్యదేవా చిల్లీస్, విజయ ఆదిలక్ష్మి ట్రేడర్స్, అనిల్‌ అండ్‌ కంపెనీ, వి.ఎం.స్పైస్‌ కంపెనీ ప్రైవేటు లిమిటెడ్, వి.ఎం.ఆర్‌.స్పైసెస్‌ ప్రొడక్ట్స్, వర్షిణి జనరల్‌ ట్రేడింగ్‌ కంపెనీ, రజిత్‌ ఎక్స్‌పోర్ట్సు, వేగాస్‌ ప్రొడక్ట్స్‌, వోలేమ్‌ అగ్రో ఇండియా ప్రైవేటు లిమిటెడ్, లక్ష్మీగణపతి ఇండస్ట్రీస్‌ లైసెన్సులు రద్దు చేసినట్లు తెలిపారు. సమావేశంలో యార్డు అధికారి సుబ్రహ్మణ్యం, పాలకవర్గ సభ్యుడు శ్రీరాం రాజీవ్‌ ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement