యంత్రం.. యాతనే! | gst on mition tools and subsidy | Sakshi
Sakshi News home page

యంత్రం.. యాతనే!

Sep 8 2017 12:53 PM | Updated on Sep 17 2017 6:36 PM

యంత్రం.. యాతనే!

యంత్రం.. యాతనే!

వ్యవసాయ యాంత్రీకరణ పథకం అమలులో ప్రభుత్వం సరికొత్త విధానాన్ని అమలు చేయబోతోంది. ఇప్పటివరకు యంత్ర పరికరం కొనుగోలులో రాయితీ పోను మిగిలిన సొమ్ము

యాంత్రీకరణకు సరికొత్త విధానం
రాయితీ యంత్ర పరికరాలకు డీబీటీ
కొనుగోలు చేయాలంటే ఖరీదు మొత్తం ముందే చెల్లించాలి
రాయితీ సొమ్ము తర్వాత రైతు ఖాతాకు జమ
జీఎస్టీ అమలుతో మారనున్న రాయితీ యంత్ర పరికరాల రేట్లు  


కడప అగ్రికల్చర్‌ :
వ్యవసాయ యాంత్రీకరణ పథకం అమలులో ప్రభుత్వం సరికొత్త విధానాన్ని అమలు చేయబోతోంది. ఇప్పటివరకు యంత్ర పరికరం కొనుగోలులో రాయితీ పోను మిగిలిన సొమ్ము నగదు రూపంలో గానీ, డీడీ రూపంలోగానీ కంపెనీకి చెల్లిస్తే యాంత్రీకరణ పరికరం రైతుకు చేరేది. ఇక నుంచి డీబీటీ (డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌) విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ పద్ధతి ద్వారా యంత్ర పరికరాల కొనుగోలులో నేరుగా రైతు ఖాతాకే రాయితీ జమ అవుతుంది. ఈ విధానంలో రైతు ముందుగా యంత్రం ఖరీదు మొత్తం చెల్లించాల్సి ఉంది. ఆ మొత్తం యంత్రం కొనుగోలు చేసే డీలర్‌ అకౌంట్‌కు జమచేయాలి. ఆ తర్వాత ప్రభుత్వం ప్రకటించిన రాయితీ సొమ్ము తిరిగి రైతు ఖాతాకి జమచేస్తారు. అంటే ఇప్పుడు వంట గ్యాస్‌కు అమలు చేస్తున్న విధానాన్ని వ్యవసాయ యాంత్రీకరణ పథకానికి అమలు చేయబోతున్నారు.

యాప్‌ ద్వారానే ఆన్‌లైన్‌ దరఖాస్తు
సబ్‌మిషన్‌ ఆన్‌ అగ్రికల్చర్‌ మెకనైజేషన్‌(ఎస్‌ఎంఎఎం) పథకం అమలుకు ప్రభుత్వం కొత్త యాప్‌ను తీసుకొచ్చింది. ఈ యాప్‌ ద్వారా రైతులు ఆన్‌లైన్‌  దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. రైతు కావాల్సిన కంపెనీని ఎంపిక చేసుకుని ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకోవచ్చు. పైగా జిల్లాకు కేటాయించిన వ్యవసాయ రాయితీ పరికరాలను ఆయా మండలాలకు కేటాయిస్తారు. ఆ మండలాలకు కేటాయించిన యంత్రాలకే రైతులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఒకవేళ రైతు కోరుకున్న వ్యవసాయ పరికరంగానీ, యంత్రంగానీ లేకపోయిన ఆల్‌ రెడీ ఇతర రైతులు దరఖాస్తు చేసుకుని ఉన్నా లేదా ఆ మండలానికి కేటాయించిన పరికరాలు అయిపోయినా రైతు వెనుదిరగాల్సిందే.

నూతన యాప్‌పై శిక్షణ
డీబీటీ ద్వారా అమలు చేసే యాంత్రీకరణ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు కొత్తగా అమలు చేయబోయే యాప్‌పై వ్యవసాయ శాఖ టెక్నికల్‌ ఏథోలకు త్వరలో శిక్షణ ఇవ్వనున్నారు. ఆ తర్వాత ఈ యాప్‌ అమలుపై అటు రైతులకు, ఇటు వ్యవసాయాధికారులకు అవగాహన కల్పిస్తారు. అనంతరం వ్యవసాయ పరికరాలు కావాల్సిన రైతులు నేరుగా కొత్త యాప్‌ ద్వారా ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకోవచ్చని వ్యవసాయశాఖ టెక్నికల్‌ అధికారులు చెబుతున్నారు. అయితే ఈ ఏడాది కొత్తగా ప్రవేశపెట్టే ఈ విధానం గురించి రైతులకు తెలిస్తే వ్యతిరేకత వచ్చే అవకాశం లేకపోలేదు. ఇప్పటివరకు రాయితీ సొమ్ము పోను మిగతా సొమ్ము చెల్లించి యంత్రాలు కొనుగోలు చేయలేక రైతులు సతమతమవుతున్నారు. కొత్త విధానంలో యం త్రం రేటు మొత్తం ముందుగా చెల్లించి కొనుగోలు చేయాలంటే రైతులకు కష్టమే అవుతుంది. చిన్న, సన్నకారు రైతులతో పాటు ఎస్సీ, ఎస్టీ రైతులు సబ్సిడీ యంత్రాలకు దూరమవుతారు.

యంత్ర పరికరాలకు మారనున్న రేట్లు
ఈ ఏడాది జూలై నుంచి అమలవుతున్న జీఎస్టీతో గతంలో ఉన్న యంత్ర పరికరాల ధరలు మారనున్నాయి. విత్తనం గొర్రు, ఎరువులు, విత్తనం ఒకేసారి విత్తే గొర్రు, తొమ్మిది చెక్కల గొర్రు, పదకొండు చెక్కల గొర్రు, రెండు మడకల పరికరం, వరికోత మిషన్, ఫవర్‌ వీడర్, తైవాన్‌ స్ప్రేయర్, ట్రాక్టన్‌ మౌన్‌టెడ్‌ స్ప్రేయర్, రోటోవేటర్‌ తదితర పరికరాలతో పాటు చిన్న, పెద్ద ట్రాక్టర్ల రాయితీ రేట్లు మారనున్నాయి. జీఎస్టీ విధానంలో జాప్యం వలన రాయితీ రేట్లు ఖరారు కాలేదు. వాటి విధివిధానాలు అమలు చేస్తున్నట్లు సమాచారం అయితే ఉందని జిల్లా వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. కానీ పూర్తి వివరాలు ఇంత వరకు రాలేదని అధికారులు అంటున్నారు.

జిల్లాకు రూ.90కోట్ల ప్రతిపాదనలు
2017–18 లో ప్రస్తుతం ఖరీఫ్‌ సీజన్లో వ్యవసాయ రాయితీ పరికరాలను అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు జిల్లా వ్యవసాయశాఖ ఎస్‌ఎంఎఎం స్కీం కింద రూ.33 కోట్లు, రాష్ట్రీయ కృషి వికా>స్‌ యోజన కింద రూ.3కోట్లు, ఎస్‌డీపీ కింద రూ. 27 కోట్లతో ప్రతిపాదనలు పంపింది. ఇందులో రాష్ట్రప్రభుత్వం నిధులు 40 శాతం, కేంద్ర నిధులు 60శాతం ఉన్నాయి. వ్యవసాయ పరికరాల కొనుగోలులో జనరల్‌ కేటగిరి కింద 50శాతం రాయితీ, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 70 శాతం రాయితీ అమలు చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement