భారతీయ సంగీతం అజరామరం

భారతీయ సంగీతం అజరామరం - Sakshi


–ఘంటసాల సంగీత విభావరిలో స్వామి ఆత్మవిదానంద

–ఆకట్టుకున్న ఆ పాత మధురాలు




అనంతపురం కల్చరల్‌ : దైవదత్తమైన సంగీతామృతంతో కఠిన శిలలనైనా కరిగించగల్గిన ఘంటసాల సంగీతం అజరామరమని స్వామి ఆత్మ విదానంద అన్నారు. ఆదివారం స్థానిక త్యాగరాజ సంగీత సభలో అమరగాయకుడు 95వ జయంతి సందర్భంగా  సంగీత విభావరి జరిగింది. అనంత ఘంటసాల ఆరాధనా సమితి వ్యవస్థాపకుడు పాలసముద్రం నాగరాజు  ఆధ్వర్యంలో  జరిగిన కార్యక్రమానికి చిన్మయామిషన్‌ జిల్లా ఇన్‌చార్జి స్వామి ఆత్మవిదానంద, సంగీత సభ కార్యదర్శి ప్రభావతి, ఆదరణ శైలజ, సీనియర్‌ న్యాయవాది  సంపత్‌కుమార్‌ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని ఘంటసాల విశిష్ట గానాన్ని గురించి ప్రసంగించారు.  ఘంటసాల ఆలపించిన భగవద్గీత గానం  భారతీయ సంగీతంలోనే ప్రత్యేక స్థానం పొందిందని, ఆయన వాగ్గేయకారుల సరసన నిలచి తెలుగు వారి కీర్తిని ఇనుమడింపజేశాడని వక్తలు కొనియాడారు. అంతకు ముందు ఘంటసాల చిత్రపటం ముందు జ్యోతిప్రజ్వలన చేసి నివాళులర్పించారు.



ఆకట్టుకున్న ఆ పాత మధురాలు

అనంతరం జరిగిన సంగీత విభావరిలో జిల్లా గాయనీగాయకులే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి విచ్చేసిన గాయకులు ఘంటసాల పాటలతో అలరించారు. ఆ పాత మధురాలైన 'శివ శంకరీ..' 'మాణిక్యవీణ'  'నన్ను దోచుకుందువటే..వన్నెల దొరసాని' వంటి పాటలు ఆహూతులను ఆనందడోలికల్లో ముంచెత్తాయి. ముఖ్యంగా  జిల్లా కళాకారులు పాలసముద్రం నాగరాజు, మహీధర్, రామశర్మ, శోభారాణి, శ్రీదేవి, వైదేహి తదితరులు ఆలపించిన పాటలు అందరిన అమితంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో త్యాగరాజ సంగీత సభ నిర్వాహకులు లలితకళాపరిషత్తు అధ్యక్షులు మేడా సుబ్రమణ్యం, నాగేశ్వరి, దత్తాత్రేయ, భరత్, నాగస్వరూప్‌  తదితరులు పాల్గొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top