పంటమార్పిడితో ప్రయోజనం
ఏటా ఒకే రకం పంటలు వేయకుండా పంటమార్పిడి చేస్తే ప్రయోజనం ఉంటుందని ఎన్‌ఆర్‌ఐ అగ్రిటెక్ ప్రొఫెసర్, శాస్త్రవేత్త ఆలపాటి సత్యనారాయణ అన్నారు.
నంద్యాలరూరల్: ఏటా ఒకే రకం పంటలు వేయకుండా పంటమార్పిడి చేస్తే ప్రయోజనం ఉంటుందని ఎన్‌ఆర్‌ఐ అగ్రిటెక్ ప్రొఫెసర్, శాస్త్రవేత్త ఆలపాటి సత్యనారాయణ అన్నారు. శనివారం నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సమావేశ మందిరంలో అంతర్జాతీయ పప్పు దినుసుల సంవత్సరాన్ని పురస్కరించుకుని పప్పు దినుసుల సాగులో ఆధునిక మెలకువలు అన్న అంశంపై సదస్సు నిర్వహించారు. అతిథిగా హాజరైన ఆలపాటి సత్యనారాయణ మాట్లాడుతూ నేలలో కార్బన్ శాతం పెంచే మార్గాలను రైతులకు వివరించారు. శనగ, పెసర, మినుము, కంది, వరి, కొర్ర, తదితర నూతన వంగడాలను రైతులకు అందుబాటులో ఉన్నాయన్నారు. అపరాలను అంతర్ పంటగా సాగు చేస్తే మేలని చెప్పారు. ఆర్‌ఏఆర్‌ఎస్ ఏడీఆర్ డాక్టర్ గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ నంద్యాల శనగ, నంద్యాల శనగ 49, యంత్రాల కోతకు అనువైన శనగ ధీర, నంద్యాల గ్రామం 119 రకాల గురించి రైతులకు వివరించారు. సదస్సులో ఎన్‌జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ పాలక మండలి మాజీ సభ్యుడు పోచా బ్రహ్మానందరెడ్డి, వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్ జయలక్ష్మి, డాక్టర్ సరళమ్మ, డాక్టర్ కయ్యుం అహమ్మద్, డాక్టర్, త్రివిక్రంరెడ్డి, డాక్టర్ కామక్షి, తదితర సీనియర్, జూనియర్ శాస్త్రవేత్తలు, నంది రైతు సమాఖ్య ప్రతినిధులు, వివిధ ప్రాంతాల రైతులు పాల్గొన్నారు.