నలుగురు చెయిన్‌ స్నాచర్‌ల అరెస్ట్‌

నలుగురు చెయిన్‌ స్నాచర్‌ల అరెస్ట్‌

ఏలూరు అర్బన్‌: నగరంలోని వివిధ పోలీసు స్టేషన్‌ల పరిధిలో 13 గొలుసు దొంగతనాలకు పాల్పడిన నలుగురు నిందితులను వన్‌టౌన్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. స్థానిక వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో శనివారం విలేకరుల సమావేశంలో ఏలూరు డీఎస్పీ గోగుల వెంకటేశ్వరరావు వివరాలు వెల్లడించారు. స్థానిక వన్‌టౌన్‌ పరిధిలోని వంగాయగూడెంలో నివాసముంటున్న వాసే దిలీప్, పిల్లి విజయ్‌కుమార్, బాణోతు రాజు, రౌతు నాగిరెడ్డి అనే నలుగురు యువకులు జల్సాలు, చెడు అలవాట్లకు బానిసై చోరీలకు పాల్పడుతున్నారు. చెయిన్‌ స్నాచింగ్‌ను ఆదాయమార్గంగా ఎంచుకుని నగరంలో బైకులపై తిరుగుతూ వన్‌టౌన్‌ పరిధిలో 6, టూటౌన్‌ పరిధిలో 2, త్రీటౌన్‌ పరిధిలో 4, ఏలూరు రూరల్‌ పరిధిలో 1 గొలుసు దొంగతనాలకు పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఆయా స్టేషన్లలో కేసులు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం డీఎస్పీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో టౌన్‌ సీఐ ఎన్‌.రాజశేఖర్, వన్‌టౌన్‌ ఎస్సై కె.రామారావు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో వంగాయగూడెంలో నివాసముంటున్న ఈ యువకులు విలాసవంతంగా గడుపుతూ విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నారని గుర్తించారు. డీఎస్పీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిఘా పెట్టిన సీఐ రాజశేఖర్, ఎస్సై రామారావు వారిని నిందితులుగా నిర్ధారించి అరెస్ట్‌ చేసేందుకు గాలింపు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో కొత్తగూడెం సెంటర్‌లో వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా బైకులపై అటుగా వస్తున్న నిందితులను అరెస్ట్‌ చేసి విచారించారు. వారి నుంచి సుమారు 27 కాసుల బంగారు నగలు, మూడు బైకులను స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ చెప్పారు. సీఐ ఎన్‌.రాజశేఖర్, ఎస్సై కె. రామారావు సిబ్బంది పాల్గొన్నారు.
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top