
'పశ్చిమ'కు మరో మణిహారం
జిల్లావాసుల కల నెరవేరింది. జాతీయ స్థాయి ఉన్నత విద్యాసంస్థ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) కొలువు తీరింది.
- ఉన్నత విద్యాసంస్థకు శంకుస్థాపన
- తాత్కాలిక తరగతులకు భవనాలు రెడీ
- 24 నుంచి ధ్రువీకరణ పత్రాల పరిశీలన
జిల్లావాసుల కల నెరవేరింది. జాతీయ స్థాయి ఉన్నత విద్యాసంస్థ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) కొలువు తీరింది. దేశంలో 31వ నిట్ భవన నిర్మాణాల శంకుస్థాపన తాడేపల్లిగూడెం గురువారం జరిగింది. ముఖ్యమంత్రి, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, వేలాది మంది విద్యార్థుల సమక్షంలో ఈ వేడుక నిర్వహించారు. 8 బ్రాంచ్‌లు 480 సీట్లతో ప్రారంభం కానున్న నిట్ 'పశ్చిమ' కు మరో మణిహారంగా నిలవనుంది.
తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లిలోని వాసవి ఇంజినీరింగ్ కళాశాలలో నిట్ తాత్కాలిక తరగతుల నిర్వహణకు భవనాలను సిద్ధం చేశారు. తరగతి గదులు, ల్యాబ్‌లు, కంప్యూటర్‌లు, విద్యా సామగ్రి సిద్ధమయ్యాయి. వరంగల్ నిట్ మాదిరిగా తాడేపల్లిగూడెం నిట్‌కు కేంద్ర ప్రభుత్వం 480 సీట్లు కేటాయించింది. వీటితో పాటు వరంగల్ నిట్‌లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల కోసం 60 సూపర్ న్యూమరరీ పోస్టులు కేటాయించారు. ఈ ఏడాది జేఈఈ మెయిన్ పరీక్షలకు 14 లక్షల మంది హాజరయ్యారు. వారిలో 13 వేల నుంచి 33 వేల ర్యాంకు సాధించిన విద్యార్థులకు నిట్‌లో చేరే అవకాశం ఉంటుంది.
మన రాష్ట్ర నిట్‌కు కేటాయించిన 480 సీట్లలో హోమ్‌స్టేట్ కోటా కింద 240 సీట్లు కేటాయించారు. ఇటీవల కౌన్సెలింగ్ జరగ్గా 480 సీట్లు భర్తీ అయ్యాయి. ఈనెల 24వ తేదీ నుంచి విద్యార్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన, 27న పేరెంట్ ఇంటరాక్షన్ కార్యక్రమాలు నిర్వహించి 28వ తేదీ నుంచి తరగతులు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశామని వరంగల్ నిట్ మెంటర్ ప్రొఫెసర్ టి.శ్రీనివాసరావు తెలిపారు. ఈ నెల 26వ తేదీ వరకు నిట్ ప్రవేశానికి అవకాశం ఉందని ఏపీ నిట్ రెసిడెంట్ కో-ఆర్డినేటర్ ప్రొఫెసర్ పి.రమేష్ తెలిపారు.
వారంలో ఐదు రోజులు క్లాసులు
నిట్‌లో వారంలో ఐదు రోజులపాటు తరగతులు నిర్వహిస్తారు. బుధ, గురువారాలు విద్యార్థులకు సెలవు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 7 గంటల వరకు తరగతులు ఉంటాయి. అడ్‌హక్ ప్రాతిపదికన ఫ్యాకల్టీల నియూమకానికి ఇటీవల నోటిఫికేషన్ ఇచ్చారు. 940 దరఖాస్తులు రాగా 20 మందిని ఎంపిక చేశారు. వీరితో పాటు వారానికి రెండ్రోజులు వరంగల్ నిట్‌కు చెందిన 12 మంది ఫ్యాకల్టీలు ఇక్కడ విధులు నిర్వర్తిస్తారు.
30 నుంచి తరగతులు
పెదతాడేపల్లిలోని వాసవి ఇంజినీరింగ్ కళాశాలలోని తాత్కాలిక భవనాల్లో ఈనెల 28వ తేదీ నుంచి తరగతులు నిర్వహిస్తారు. 24, 25, 26 తేదీల్లో విద్యార్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన, 27న విద్యార్థులు, తల్లిదండ్రుల ఇంటరాక్షన్ కార్యక్రమం ఉంటుంది. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బాలికలకు అదే ప్రాంగణంలో, బాలురకు నల్లజర్ల ఏకేఆర్‌జీ కళాశాలలో హాస్టల్ వసతి కల్పించారు.
కోర్సులు సీట్లు
బయోటెక్నాలజీ ఇంజినీరింగ్ 30 సీట్లు
కెమికల్ ఇంజినీరింగ్ 30 సీట్లు
సివిల్ ఇంజినీరింగ్ 60 సీట్లు
కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ 90 సీట్లు
ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ 90 సీట్లు
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ 90 సీట్లు
మెకానికల్ ఇంజినీరింగ్ 60 సీట్లు
మెటలార్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజినీరింగ్ 30 సీట్లు