సీఎం సెక్రటరీనంటూ మాజీ జర్నలిస్టు మోసాలు | formar journalist doing scams in the name of princepal secretary | Sakshi
Sakshi News home page

సీఎం సెక్రటరీనంటూ మాజీ జర్నలిస్టు మోసాలు

Sep 24 2016 10:48 PM | Updated on Sep 4 2018 5:24 PM

సీఎం ప్రిన్సిపల్‌ సెక్రటరీనంటూ డబ్బు డిమాండ్‌ చేసిన ఓ కేటుగాడిని సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు.

సాక్షి, సిటీబ్యూరో: సీఎం ప్రిన్సిపల్‌ సెక్రటరీనంటూ విశ్రాంత సీటీఓకు ఫోన్‌ చేసి డబ్బు డిమాండ్‌ చేసిన ఓ కేటుగాడిని సీసీఎస్‌ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. సీసీఎస్‌ డీసీపీ అవినాశ్‌ మహంతి కథనం ప్రకారం... రంగారెడ్డి జిల్లా  కంట్లూరు గ్రామానికి చెందిన రాయబండి సూర్య ప్రకాశ చారి ఇంటర్మీడియట్‌ వరకు చదువుకున్నాడు. 2002 నుంచి కొన్నేళ్ల పాటు వివిధ పత్రికలు, మ్యాగజైన్‌లలో రిపోర్టర్‌గా పనిచేశాడు.

పని చేసిన ప్రతిచోటా మద్యం తాగి ఆఫీసుకు రావడంతో పాటు ప్రవర్తన బాగా లేకపోవడంతో యజమాన్యాలు అతడిని ఉద్యోగం నుంచి తొలగించాయి. ఈ క్రమంలో అక్రమ సంపాదనకు పథకం వేశాడు. కొన్ని ఆస్పతులు, స్కూళ్లు, వ్యాపారులు, ప్రభుత్వాధికారులను ఎంపిక చేసుకొని వారికి ఫోన్‌ చేసేవాడు. కొందరికి సీనియర్‌ జర్నలిస్ట్‌నని, మరికొందరికి తాను తెలంగాణ సీఎం ప్రిన్సిపల్‌ సెక్రటరీనని, మాజీ సీఎం పీఏ, హోంశాఖ కార్యదర్శినని చెప్పేవాడు.

మీడియా వాళ్లు కొన్ని కార్యక్రమాలు చేయబోతున్నారని, అందుకు కొంత డబ్బు ఇవ్వాలని డిమాండ్‌ చేసి దండుకుంటున్నాడు. మాజీ సీఎం పీఏనని బెదిరించి కోరుట్ల మున్సిపల్‌ కమిషనర్‌ను బెదిరించి డబ్బు వసూలుకు పాల్పడిన కేసులో గతేడాది నగర సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఇలాంటి కేసుల్లోనే కుషాయిగూడ, చైతన్యపురి, కీసర, మీర్‌పేట పోలీసులు కూడా అరెస్టు చేశారు.

ఇదిలా ఉండగా.. తాజాగా, కె.బాలసముద్రం అనే రిటైర్డ్‌ సీటీఓకు  సూర్య ప్రకాశ చారి ఫోన్‌ చేశాడు. ఖమ్మంలో జర్నలిస్టు కాన్ఫరెన్స్‌ నిర్వహించబోతున్నామని, అందుకు కొంత డబ్బు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు.  సదరు రిటైర్డ్‌ సీటీఓకు అనుమానం వచ్చి సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు సూర్యప్రకాశచారిని శనివారం అరెస్టు చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement