వ్యవ‘సాయ’ వైద్యుడు | Farmers in the villages of profiling | Sakshi
Sakshi News home page

వ్యవ‘సాయ’ వైద్యుడు

Jan 13 2017 10:25 PM | Updated on Sep 5 2017 1:11 AM

వ్యవ‘సాయ’ వైద్యుడు

వ్యవ‘సాయ’ వైద్యుడు

ఆయన వృత్తిరీత్యా పిల్లల వైద్యుడు.. అయినా వ్యవసాయమంటే ఎనలేని ఇష్టం. ఆ అభిమానంతోనే పేద రైతులను ఆదుకునేందుకు ముందుకొస్తున్నారు.

వడ్డీలేని రుణాలిచ్చేందుకు ముందుకు
గ్రామాల్లో రైతుల వివరాల సేకరణ
సేంద్రియ సాగు చేసేవారికి సన్మానం


ఆయన వృత్తిరీత్యా పిల్లల వైద్యుడు.. అయినా వ్యవసాయమంటే ఎనలేని ఇష్టం. ఆ అభిమానంతోనే పేద రైతులను ఆదుకునేందుకు ముందుకొస్తున్నారు. సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతులను సన్మానిస్తున్నారు. గ్రామాల్లోని పేద రైతులను గుర్తించి వారికి వడ్డీలేకుండా రుణాలు ఇప్పిస్తున్నారు. ఇప్పటికే సారంగాపూర్‌ మండలంలోని మూడు గ్రామాల్లో పేద రైతులను గుర్తించారు.

అంతేకాకుండా రైతులు పండించిన ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకే విక్రయించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయనే.. జగిత్యాల పట్టణానికి చెందిన ఎల్లాల శ్రీనివాస్‌రెడ్డి.     – సారంగాపూర్‌ (జగిత్యాల)  వ్యవసాయాన్ని రైతులు పండుగలా చేసుకోవాలన్న తలంపుతో జగిత్యాలకు చెందిన వైద్యుడు శ్రీనివాస్‌రెడ్డి సంకల్పించారు. ఇప్పటికే పదేళ్లుగా పేద విద్యార్థులను చదువుల వైపు మళ్లించేందుకు ఆర్థికంగా సాయం చేస్తున్నారు. క్రీడల్లో రాణించే విద్యార్థులకు చేయూతనిస్తున్నారు.

కొత్త ఆలోచనకు శ్రీకారం
వ్యవసాయంలో నష్టాలు సర్వసాధారణం. అయితే కొందరు రైతులు వాటిని అధిగమించి మరోసారి సాగుకు సన్నద్ధమవుతారు. మరికొందరు రైతులు మానసికంగా కృంగిపోతారు. పరిస్థితుల ప్రభావంతో కొందరు ఆత్మహత్యల వైపు మొగ్గుచూపుతారు. ఈ క్రమంలో పేద రైతులను ఆదుకునేందుకు శ్రీనివాస్‌రెడ్డి సంకల్పించారు. ఒక్కో రైతుకు పంటల పెట్టుబడి కోసం రూ.30వేల వరకు అందించేందుకు సంకల్పించారు. ఇప్పటికే సారంగాపూర్‌ మండలంలోని పెంబట్ల, కోనాపూర్, పోచంపేట గ్రామాల రైతులను కలిసి పేదల వివరాలు సేకరించారు. అలాగే సేంద్రియ వ్యవసాయం చేసిన రైతులు 58మందిని గుర్తించి సన్మానించారు. పంటల సాగు విధానంపై ధర్మపురి మండలం నాగారానికి చెందిన తన బంధువు గడ్డం సత్యనారయణరెడ్డి (రాష్ట్రస్థాయిలో ఉత్తమ రైతు) తో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతుల వద్దకు తీసుకెళ్తున్నాడు. వ్యవసాయశాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులను వారివారి గ్రామాలకు తీసుకెళ్లి సాగులో మెలకువలు వివరిస్తున్నారు.

అప్పు ఇస్తాడిలా..
గ్రామాల్లో వ్యవసాయం చేయాలని ఉన్నా.. పెట్టుబడికి ఇబ్బందిపడేవారిని గుర్తించి.. రెండెకరాలు ఉన్న రైతుకు రూ.30 వేలు.. ఆపైనా వడ్డీలేకుండా రుణాలు ఇచ్చేందుకు సంకల్పించారు శ్రీనివాస్‌రెడ్డి. ఇప్పటికే గ్రామాల్లోని చాలామంది రైతుల వివరాలు సేకరించారు. వారందరికీ త్వరలోనే రుణాలు ఇస్తానని శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement