మల్లన్నసాగర్‌ను వ్యతిరేకిస్తూ మూడు నెలలపాటు తీవ్రమైన ఉద్యమం చేసిన మెదక్ జిల్లా తొగుట మండలం ఏటిగడ్డ కిష్టాపూర్ వాసులు మనసు మార్చుకున్నారు.
- రిజర్వాయర్‌కు భూములిస్తామని రైతుల ప్రకటన
- ప్రభుత్వానికి సహకరిస్తామని హరీశ్ సమక్షంలో వెల్లడి
- ఎకరాకు రూ.6 లక్షల పరిహారం, ఇతర సౌకర్యాలు
- ఏటిగడ్డ బాటలో ఎర్రవల్లి, లక్ష్మాపూర్ రైతులు కూడా
గజ్వేల్: మల్లన్నసాగర్‌ను వ్యతిరేకిస్తూ మూడు నెలలపాటు తీవ్రమైన ఉద్యమం చేసిన మెదక్ జిల్లా తొగుట మండలం ఏటిగడ్డ కిష్టాపూర్ వాసులు మనసు మార్చుకున్నారు. రిజర్వాయర్ కోసం భూములిచ్చేందుకు ఎట్టకేలకు ముందుకొచ్చారు. ఈ విషయంలో మంత్రి హరీశ్ చొరవ ఫలించింది. గ్రామవాసులు మంగళవారం గజ్వేల్ మండలం బంగ్ల వెంకటాపూర్‌లోని నర్సరీలో హరీశ్‌తో 3 గంటలపాటు చర్చలు జరిపారు. అనంతరం మాట్లాడుతూ.. రిజర్వాయర్ నిర్మాణానికి సహకరిస్తామని ప్రకటించారు. సీఎం కేసీఆర్, హరీశ్‌లపై తమకు సంపూర్ణ విశ్వాసముందన్నారు. ఎకరాకు రూ.6 లక్షల పరిహారానికి అంగీకరిస్తున్నట్టు వెల్లడించారు. ఈ గ్రామంలో సుమారు 1800 ఎకరాలను ప్రభుత్వం సేకరించనుంది. ఇక ఎర్రవల్లి, లక్ష్మాపూర్ గ్రామాల రైతులు కూడా ఇదే బాటలో నడుస్తున్నారు. కొండపాక మండలం ఎర్రవల్లి గ్రామ రైతులతో డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి మాట్లాడి భూములిచ్చేందుకు ఒప్పించారు.
రూ.7 లక్షలడిగిన రైతులు
కిష్టాపూర్‌కు చెందిన వివిధ సామాజిక వర్గాల ప్రతినిధులు, తెలంగాణ రాష్ట్ర రైతు పరిరక్షణ సమితి నాయకులు పాకాల శ్రీహరి రావు తదితరులు మంత్రితో చర్చల్లో పాల్గొన్నారు. పలు అంశాలపై చర్చించారు. ఎకరాకు రూ.7 లక్షల పరిహారమివ్వాలని రైతులు పట్టుబట్టారు.
ఇవీ మంత్రి హామీలు...
మల్లన్నసాగర్ నిర్వాసితులకు ఇస్తున్న నష్టపరిహార ప్యాకేజీ అత్యుత్తమమైనదని చర్చల సందర్భంగా హరీశ్ అన్నారు. జీఓ 123 ప్రకారం ఎకరాకు రూ.5.85 లక్షలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మల్లన్నసాగర్ గ్రామాన్ని తాను దత్తత తీసుకుంటానని ప్రకటించారు. ‘‘నాతోపాటు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి కూడా దత్తత తీసుకుని అభివృద్ధిై చేస్తారు. ప్రతి ఒక్కరికీ డబుల్‌బెడ్రూం పథకం కింద ఇళ్లు నిర్మించిస్తాం. బావులకు, బోర్లకు, చెట్లకు, ఇళ్లకు అదనపు పరిహారం ఉంటుంది. పూర్తిగా భూమి, ఇళ్లు లేని పేదలనూ తగువిధంగా ఆదుకుంటాం. కొత్తగా నిర్మించే కాలనీల్లో గుడి, బడి, కరెంటు, శ్మశానవాటిక తదితర సౌకర్యాలు సమకూరుస్తాం. చేపలపై వచ్చే ఆదాయాన్ని ఏటా భృతిగా అందిస్తాం. నిర్వాసితుల పిల్లలందరినీ మంచి పాఠశాలల్లో చదివిస్తాం’’ అని స్పష్టం చేశారు. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని నిర్వాసితులు కోరినచోట సమకూర్చాలని గజ్వేల్ తహసీల్దార్ బాల్‌రెడ్డిని ఆదేశించారు. ఎకరాకు రూ.6 లక్షలకు మంత్రి అంగీకారం తెలపడంతో,రిజిస్ట్రేషన్ చేసివ్వడానికి ఒప్పుకున్నారు.
వార్తల్లో నిలిచిన గ్రామం
మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణంతో దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గాల్లో 14 గ్రామాలు ముంపునకు గురవుతుండటం తెలిసిందే. ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామం నిర్వాసితుల ఉద్యమంతో ఇటీవల రాష్ట్రస్థాయిలో వార్తల్లో నిలిచింది. ఉద్యమంలో ఏటిగడ్డవాసులు కీలకపాత్ర పోషించారు. విపక్ష నేతల దీక్షలు, ధర్నాలు, గ్రామస్తుల ఆందోళనలు పెద్ద ఎత్తున సాగాయి.
ఏటిగడ్డవాసుల స్ఫూర్తి అభినందనీయం: హరీశ్
లక్షలాది ఎకరాలను సస్యశ్యామలం చేసే మహోన్నత ఆశయానికి కిష్టాపూర్‌తో పాటు లక్ష్మాపూర్, ఎర్రవల్లి గ్రామస్తులు సహకరించడానికి ముందుకు రావడం అభినందనీయమని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. చర్చలు ఫలించిన అనంతరం నిర్వాసితులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘దశాబ్దాల తరబడి గ్రామంతో ఉన్న అనుబంధం కోల్పోతున్నం దుకు బాధ సహజమే. వారికి ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బందులు రానివ్వం.
కడుపులో పెట్టి చూసుకుంటాం. మల్లన్నసాగర్ పూర్తి చేసి తెలంగాణకు నీరివ్వడం ఎంత ముఖ్యమో నిర్వాసితులను ఆదుకోవడం కూడా ప్రభుత్వానికి అంతే ముఖ్యం. ముంపు గ్రామాల ప్రజలకు నాతోపాటు ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి అండగా ఉంటారు. ఎన్నో పార్టీలు గ్రామానికి వెళ్లి ఎన్నో రకాల గందరగోళం సృష్టించినా వాస్తవ పరిస్థితులను తెలుసుకుని పెద్ద మనసుతో ప్రభుత్వానికి సహకరించడానికి ముందుకు రావడం అభినందనీయం’’ అన్నారు.