పంట ఎండిపోతుందని..

పంట ఎండిపోతుందని.. - Sakshi

 • మూడు బోర్లు వేసినా నీళ్లు పడలేదని ఆవేదన

 •  ఉరేసుకుని యువ రైతు ఆత్మహత్య  

 • వెంకటగిరి :

  వర్షాభావ పరిస్థితులతో కళ్ల ముందే నిమ్మతోట ఎండిపోతుందని తట్టుకు లేకపోయిన ఓ యువ రైతు చేసిన అప్పులు తీరవని మనస్థాపంతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. డక్కిలి మండలం కమ్మపల్లికి పోకూరి వెంకటేశ్వర్లుకు ఇద్దరు కుమారులు, చిన్నవాడైన నివాస్‌ (24) ఎంబీఎ చదువుతున్నాడు.తమలా కష్ట పడకూడదని, ఉన్నత చదువులు చదివించేందుకు తల్లిదండ్రులు కష్టపడ్డారు. అయితే ఎంబీఏ గ్రాడ్యుయేషన్‌ చేస్తూనే వ్యవసాయంపై మక్కువతో తండ్రితో పాటు నిమ్మ చెట్లు సాగు చేస్తున్నాడు. కొంత కాలంగా వర్షాభావంతో నీళ్లు లేక నిమ్మచెట్లు వాడు ముఖం పట్టాయి. అప్పులు చేసి పొలంలో మూడు చోట్ల బోర్లు వేయించినా నీటి జాడలు కనిపించలేదు. ఇప్పటికే అప్పుల్లో ఉన్న కుటుంబ పరిస్థితితో ఆర్థికంగా మరిన్ని కష్టాల్లో కూరుకుపోతున్నామని వారం రోజులుగా మనస్థాపం చెందుతున్నాడు. కాగా నివాస్‌కు ఎంబీఏ పరరీక్షలు ఉండటంతో గ్రామంలో ఉంటే అదే ఆలోచనతో ఉంటాడని మూడు రోజుల క్రితం వెంకటగిరిలో ఉంటున్న నివాస్‌ మేనమామ వెంకటేశ్వర్లు ఇంటికి పంపారు. ఇక్కడా అదే ధ్యాసతో మదన పడుతున్నాడు. పరీక్షల కోసం తిరుపతి వెళ్లేందుకు బుధవారం సిద్ధమైన కొద్ది సేపటికే నాకు భయంగా ఉంది.. ఏమీ చదవలేదు.. ఫెయిల్‌ అయితే ఇంకా బాధగా ఉంటుందని మేనమామ వద్ద వాపోయాడు. అయితే పరీక్షకు వెళ్లొద్దని అని ఆయన సముదాయించడంతో మానుకున్నాడు. ఈ క్రమంలో నివాస్‌ గురువారం మధ్యాహ్నం బజారుకు వెళ్లి వస్తానని చెప్పి సమీపంలో ఉన్న బంధువుకు చెందిన మోటారు సైకిల్‌ తీసుకుని వెళ్లాడు. ఎంత సేపటికి రాకపోయే సరికి బంధువులు బుధవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం ఉదయం నివాస్‌ కోసం బంధువులు వెతుకున్న తరుణంలో తోటలో గుర్తుతెలియని మృతదేహం ఉందని మనులాలపేట వాసులు చెప్పడంతో వారు వెళ్లి పరిశీలించి నివాస్‌ మృతదేహంగా గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఏఎస్‌ఐ మాల్యాద్రి సిబ్బందితో సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి అనంతరం బంధువులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  తల్లడిల్లిన బంధువులు 

  మరో ఏడాది చదువు పూర్తిచేసి ఇంటికి అండగా ఉంటాడని భావించిన నివాస్‌ వ్యవసాయం చేస్తూ పంట ఎండిపోతుందని మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడని బంధువులు రోదించడం స్దానికులను కలిచివేసింది. తండ్రి వెంకటేశ్వర్లు నివాస్‌ మృతదేహం చూసి సోమ్మసిల్లి పడిపోయాడు. కమ్మపల్లిలో విషాదఛాయలు అలముకున్నాయి. 

   

   
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top