పరిహారం ‘పాపం’ నిజమే..

పరిహారం ‘పాపం’ నిజమే..

-బోగస్‌ ఐడీ కార్డుల బాగోతాన్ని నిర్ధారించిన అధికారులు 

-ముంపు మండలాల మీ సేవా కేంద్రాల్లో పీఓ, ఆర్డీఓ తనిఖీలు

 -కూనవరంలో ఒకటి, వీఆర్‌ పురంలో రెండు కేంద్రాల సీజ్‌ 



 

కూనవరం (రంపచోడవరం) : పరిహారం కోసం సాగిన మోసకారి వ్యవహారంలో అధికార యంత్రాంగం కదిలింది. ‘పోలవరం’ ముంపు మండలాల్లో బాధితులకు ఇచ్చే పరిహారాన్ని అర్హత లేకున్నా పొందే దురుద్దేశంతోత  ఆగమేఘాలపై నకిలీ ఓటరు ఐడీ కార్డులు, ఆధార్‌ కార్డులు జారీ అవుతున్న బాగోతంపై  ‘ఇదో ‘ఐడి’యా’ పేరుతో బుధవారం ‘సాక్షి’లో వచ్చిన కథనంతో చర్యలకు ఉపక్రమించారు. అసలు క్షణాల్లో బోగస్‌ ఓటరు ఐడీ కార్డులు ఎలా లభ్యమవుతున్నాయనే దానిపై  చింతూరు ఐటీడీఏ పీఓ గుగ్గిలి చినబాబు, ఎటపాక ఆర్డీఓ ఎల్లారమ్మ బుధవారం వీఆర్‌ పురం, కూనవరం మండలాల్లోని మీసేవా కేంద్రాల్లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఓటర్‌ ఐడీ, ఆధార్‌కార్డుల నమోదులో ఆయా కేంద్రాలు పలు అవకతవకలకు పాల్పడుతున్న నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో దర్యాప్తు నిర్వహించారు.  మీ సేవా కేంద్రాల నిర్వాహకులు పేర్కొన్న అంశాలకు, దరఖాస్తుల పరిశీలనలో కనిపిస్తున్న వాస్తవాలకు పొంతన లేకపోవడంతో వీఆర్‌ పురంలో రెండు కేంద్రాన్ని, కూనవరంలో ఒక కేంద్రాన్ని సీజ్‌ చేశారు.



ఆ కేంద్రాల నుంచి హోలోగ్రామ్, స్టాంప్‌లు, తదితర రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ గతంలో పనిచేసిన «అధికారుల పేర్లతో ఉన్న స్టాంపులు వినియోగిస్తున్నారని, భద్రాచలం ఆర్డీఓ పేరుతో పాత తేదీలతో ఉన్న ఓటరు ఐడీ కార్డులు జారీ చేస్తున్నట్లు వెల్లడైందన్నారు. ఆర్డీఓ ఎల్లారమ్మ మాట్లాడుతూ గొమ్ము పొట్లవాయిగూడెంలో వీఆర్‌ పురం మండలానికి చెందిన మీ సేవా కేంద్రం నిర్వాహకుడు అవకతవకలకు పాల్పడినట్లు తనిఖీల్లో తేలిందన్నారు. ఆధార్‌ కార్డులు తీసి వెంటనే ఇస్తున్నాడని, వాటితో ఎలాంటి దరఖాస్తు చేసుకున్నా చెల్లుబాటు కాకపోవడంతో నష్టపోయామంటూ కొందరు తనకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.



అలాగే పైదిగూడెంకు చెందిన కొందరు బాధితులు కూనవరం మీ సేవ నిర్వాహకునిపై కూడా ఫిర్యాదు చేసినట్లు  చెప్పారు. ఈ నేపథ్యంలో ఆ గ్రామాల్లో విచారణ జరిపానని, నివేదికను జాయింట్‌ కలెక్టర్‌కు అందజేస్తానని తెలిపారు. కాగా పోలవరం ముంపు మండలాల్లో పరిహారం పొందేందుకు పదేళ్ల క్రితం ఊరు వదిలి వెళ్లిన వారు సైతం తిరిగివచ్చి నకిలీ ఆధార్‌కార్డులు, ఓటర్‌ ఐడీ, రేషన్‌కార్డులు పొందేందుకు మీ సేవా కేంద్రాలను ఆశ్రయించడంతో వాటి నిర్వాహకులు అవకతవకలకు పాల్పడినట్లు విచారణలో తేలడంతోనే అధికారులు ఈ కేంద్రాలపై చర్యలు తీసుకున్నారు. తనిఖీల్లో విఆర్‌పురం, చింతూరు తహసీల్దార్లు జీవీఎస్‌ ప్రసాద్, తేజేశ్వరరావు, ఎస్సైలు బి.అజయ్‌కుమార్, రామకృష్ణ, ఆర్‌ఐ చలపతిరావు, వీఆర్‌ఓ వనపర్తి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కాగా మరింత లోతుగా విచారణ జరిపితే మరిన్ని వాస్తవాలు బయటపడే అవకాశముందని, దీనివలన అసలైన అర్హులకు మేలు జరుగుతుందని నిర్వాసితులు కోరుతున్నారు. 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top