లేటరైట్‌ తవ్వకాలు.. నిలిపివేత | Dropping been letarait .. | Sakshi
Sakshi News home page

లేటరైట్‌ తవ్వకాలు.. నిలిపివేత

Aug 8 2016 11:51 PM | Updated on Aug 20 2018 8:31 PM

అక్రమంగా సాగుతున్న లైటరైట్‌ ఖనిజ తవ్వకాలకు రెడ్‌ సిగ్నల్‌ పడింది.

  • ఎక్కడి పనులు అక్కడే నిలిపివేయాలని ఆదేశాలు
  • ‘సాక్షి’ వార్తకు స్పందించిన అధికారులు
  • తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాన్ని పరిశీలించిన ఆర్డీవో
  • తవ్విన ఖనిజం పరిశీలన.. నిర్వాహకులపై ప్రశ్నల వర్షం
  • నిరంతర నిఘా వేయాలని.. నివేదిక పంపాలని తహశీల్దార్‌కు ఆదేశం
  • ‘లోకల్‌ రుబాబు’ ప్రకంపనలు రెండోరోజు కూడా కొనసాగాయి. ఎటువంటి అనుమతులు లేకుండా.. గిరిజన ప్రాంతాల్లో మైనింగ్‌ చేయరాదన్న నిబంధనలున్నా.. అన్నింటినీ కాలరాసి విలువైన లేటరైట్‌ ఖనిజాన్ని తవ్వి.. కోట్లు దోచుకుంటున్నా ఇన్నాళ్లు కనీసం అటువైపు చూడని జిల్లా యంత్రాంగం ఎట్టకేలకు స్పందించి. ఈ అక్రమ తవ్వకాలపై ‘సాక్షి’ లో వచ్చిన కథనంతో ఆలస్యమైనా.. ఉన్నతాధికార యంత్రాంగం తీవ్రంగానే స్పందించింది. మైనింగ్‌ జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి పరిశీలించింది. ఎక్కడి పనులు అక్కడే నిలిపివేయాలని ఆదేశించింది.
     
    నర్సీపట్నం: అక్రమంగా సాగుతున్న లైటరైట్‌ ఖనిజ తవ్వకాలకు రెడ్‌ సిగ్నల్‌ పడింది. తవ్వకాలతోపాటు రవాణాను తక్షణమే నిలిపివేయాలని సోమవారం ఆ ప్రాంతానికి వెళ్లిన నర్సీపట్నం ఆర్డీవో సూర్యారావు అధికారులను ఆదేశించారు. దీనిపై విచారణ జరిపి సమగ్ర నివేదిక ఇవ్వాలని కూడా ఆదేశించారు. లేటరైట్‌ అక్రమ తవ్వకాలపై ‘సాక్షి’లో ప్రచురితమైన కథనాలకు ఆయన స్పందించారు. సోమవారం మధ్యాహ్నం తవ్వకాలు జరుగుతున్న ప్రాంతానికి స్వయంగా వెళ్లి పరిశీలించారు. అప్పటికీ అక్కడ తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్న విషయాన్ని గమనించారు. తీవ్రంగా స్పందిస్తూ తవ్వకాలు, ఖనిజ రవాణాను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించారు.  ఈ సందర్భంగా అక్కడ పనిచేస్తున్న నిర్వహకుల ప్రతినిధులతో మాట్లాడారు. రోజుకు ఎన్ని లారీలు రవాణా అవుతాయనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. వారిపై ప్రశ్నల వర్షం కురిపించగా.. సరైన సమాధానాలు చెప్పలేక వారు నీళ్లు నమిలారు. దాంతో పనులను నిలిపివేయాలని.. ఇకముందు తవ్వకాలు జరగకుండా నిఘా వేయాలని స్థానిక తహశీల్దారు కనకారావును ఆదేశించారు. అలాగే మొత్తం వ్యవహారంపై పూర్తిస్థాయి నివేదిక రూపొందించి కలెక్టర్‌కు పంపాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో తవ్వకాలు జరపకూడదని స్పష్టం చేశారు. అలాకాకుండా తవ్వకాలు మళ్లీ ప్రారంభమైతే మైనింగ్‌ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  ఈ సందర్భంగా ఆర్డీవో ‘సాక్షి’తో మాట్లాడుతూ మైనింగ్‌ లీజుకు సంబంధించి గత ఏడాది చివర్లో పంచాయతీ తీర్మానాలు తప్పుగా చేసినట్లు ఫిర్యాదు అందిందన్నారు. జిల్లా పంచాయతీ అధికారి దానిపై విచారణ కూడా జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారన్నారు. ఆ తర్వాత తవ్వకాలు ప్రారంభానికి ఇచ్చిన నిరభ్యంతర పత్రం రద్దు చేశారో.. లేదో తెలపాలంటూ ఇటీవల గనులశాఖ అధికారులు తహశీల్దారును కోరారని, దానిపై ఇప్పటికే నివేదిక పంపామన్నారు. ఈ వ్యవహారంలో కలెక్టర్‌ ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని ఆర్డీవో సూర్యారావు వివరించారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement