‘గ్రిడ్’కు తొలగనున్న ఆటంకాలు | Sakshi
Sakshi News home page

‘గ్రిడ్’కు తొలగనున్న ఆటంకాలు

Published Tue, Nov 10 2015 3:14 AM

Disturbances clearing of water grid

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ తాగునీటి సరఫరా(వాటర్‌గ్రిడ్) ప్రాజెక్ట్‌కు సంబంధించి రెండు ప్రధాన ఆటంకాలు త్వరలో తొలగిపోనున్నాయి. పైప్‌లైన్ ఏర్పాటుకు సంబంధించి రైల్వే, అటవీ శాఖల అనుమతుల విషయమై ఆయా శాఖల ఉన్నతాధికారులతో పంచాయతీరాజ్ అధికారులు సోమవారం చర్చలు జరిపారు. వివిధ ప్రాంతాల్లోని రైల్వే లెవల్ క్రాసింగ్‌ల వద్ద పైప్‌లైన్ ఏర్పాటుకు అనుమతుల నిమిత్తం పంచాయతీరాజ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ ఇంజనీర్ ఎస్‌ఎన్ సింగ్‌తో భేటీ అయ్యారు. ఎస్‌ఎన్ సింగ్ స్పందిస్తూ.. క్రాసింగ్‌ల వద్ద పనులు ఏవిధంగా చేయాలనే అంశంపై రెండు శాఖలతో జాయింట్ ఇన్‌స్పెక్షన్ చేయిద్దామని ప్రతిపాదించారు. ప్రాజెక్ట్‌కు సహకారాన్ని అందించాల్సిం దిగా రైల్వే ఇంజనీరింగ్ అధికారుల(అచ్యుతరావు, ఎస్‌కే గుప్తా)కు పలు సూచనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా ఒక నోడల్ అధికారిని నియమిస్తామని ఎస్పీ సింగ్ చెప్పారు. సమావేశంలో ఆర్‌డబ్ల్యూఎస్ ఈఎన్‌సీ సురేందర్‌రెడ్డి, రైల్వే ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 అటవీ శాఖ నుంచి హామీ
 రైల్వే అధికారులతో చర్చల అనంతరం ఆర్‌డబ్ల్యూఎస్ ఈఎన్‌సీ సురేందర్‌రెడ్డి అటవీ శాఖ ప్రధాన సంరక్షణాధికారి శోభతో అనుమతుల విషయమై చర్చించారు. రాబోయే ఆరు నెలల్లో తాము చేయబోయే పనుల ప్రాధాన్యతను వివరించారు. త్వరితగతిన అనుమతులిప్పించి సహకరించాల్సిందిగా కోరారు. ప్రతిష్టాత్మకమైన వాటర్‌గ్రిడ్ ప్రాజెక్ట్‌కు అటవీ శాఖ నుంచి వీలైనంత త్వరగా అనుమతులు లభించేలా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా శోభ హామీ ఇచ్చారు.

Advertisement
Advertisement