అభివృద్ధి ప్రసంగాల్లేవు.. | Sakshi
Sakshi News home page

అభివృద్ధి ప్రసంగాల్లేవు..

Published Tue, Aug 8 2017 10:55 PM

Development  announcements not there

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలపై ఎన్నికల కోడ్‌ ప్రభావం
కాకినాడ సిటీ : కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికల నిర్వహణ ప్రభావం జిల్లా కేంద్రంలో ఈనెల 15న నిర్వహించే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలపై పడింది. ఏటా కాకినాడ పోలీస్‌ పేరెడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పతాకావిష్కరణ కార్యక్రమానికి మంత్రులు ముఖ్యఅతిథులుగా హాజరై పతాకావిష్కరణ చేసేవారు. అయితే ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండడంతో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల విషయాన్ని జిల్లా ఉన్నతాధికారులు ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొనవచ్చని, వేడుకల్లో పాల్గొన్న మంత్రులు కేవలం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సంబంధించిన అంశంపైనే ప్రసంగం ఉండాలని, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలపై మాట్లాడకుండా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అలాగే ప్రభుత్వ పరంగా సీఎం, మంత్రులు, ప్రజాప్రతినిధుల ఫొటోల ప్రదర్శన లేకుండా చూడాలని సూచించింది. దీంతో జిల్లా ప్రగతికి సంబంధించిన ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను తెలియజేసే శకటాల ప్రదర్శనపై సందిగ్ధం ఏర్పడింది. ఏటా జిల్లా పోలీసు పేరెడ్‌గ్రౌండ్‌లో స్వాతంత్య్ర దినోత్సవాన్ని మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో అత్యంత అట్టహాసంగా నిర్వహించేవారు. ఎన్నికల నియమావళి అమలులో ఉండడంతో కార్యక్రమాన్ని కాకినాడ పోలీసు పేరెడ్‌ గ్రౌండ్‌ నుంచి కాకినాడ రూరల్‌ ఏపీఎస్పీ మూడో బెటాలియన్‌కు మార్పు చేస్తే ఎలా ఉంటుందనే  తర్జనభర్జనలో అధికార యంత్రాంగం ఉంది.
పతాకావిష్కరణ జిల్లా ఇన్‌చార్జి మంత్రి
  స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పతావిష్కరణ జిల్లా ఇన్‌చార్జి మంత్రి కిమిడి కళావెంకట్రావు నిర్వహించనున్నారు. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు జిల్లా మంత్రులే పతాకావిష్కరణలు చేశారు. 2014లో ఉపముఖ్యమంత్రి, హోంశాఖా మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, 2015లో ఆర్థికశాఖా మంత్రి యనమల రామకృష్ణుడు, 2016లో మంత్రి చినరాజప్ప పతాకావిష్కరణ చేశారు.

Advertisement
Advertisement