అమరావతిపై డేగ కన్ను

అమరావతిపై డేగ కన్ను - Sakshi

* ఏవోబీ ఘటనతో అప్రమత్తమైన పోలీస్‌ యంత్రాంగం 

టెక్నాలజీని విస్తృతంగా వినియోగించుకోవాలని నిర్ణయం

 

సాక్షి, అమరావతి బ్యూరో: ఆంధ్రా, ఒడిషా బోర్డర్‌లో జరిగిన మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌ రాజధాని పల్లెలను ఉలికిపాటుకు గురి చేసింది. గతంలో ఎక్కవగా మావోయిస్టుల సానుభూతిపరుల కదలికలున్న ఈ ప్రాంతంలో ఎన్‌కౌంటర్‌ కలకలం రేపింది. దీనికి తోడు అమరావతి రాజధాని ప్రాంతం కావడం వీఐపీ, వీవీఐపీల తాకిడి పెరగడంతో మావోయిస్తుల కదలికలు ఉండొచ్చని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో పోలీసులు ప్రతి గ్రామాన్నీ జల్లెడ పడుతున్నారు.

 

గతంలో కదలికలు

రాజధాని ప్రాంత పల్లెల్లో గతంలోను మావోయిస్టుల కదలికలు ఉన్నాయి. చత్తీస్‌ఘడ్‌ ప్రాంతంలో పోలీసుల కాల్పుల్లో గాయపడిన మహిళా మావోయిస్టు చికిత్స కోసం రాజధాని ప్రాంతంలో బంధువుల ఇంటికి వచ్చినప్పడు ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంఘటనలున్నాయి. పలువురు మావోయిస్టులు ఈ ప్రాంతాలను షెల్టర్‌జోన్‌గా ఉపయోగించుకోనేవారని తెలిసింది. ఎక్కడైనా నిఘా పెరిగి కూంబింగ్‌ ఉన్నప్పుడు వారు సానుభూతిపరుల ఇళ్లకు వచ్చి జనజీవన స్రవంతిలో కలిసిపోయి ఉంటారనేది నిఘా వర్గాలకు అందిన సమాచారం. ఏవోబీ ఎన్‌కౌంటర్‌తో మావోయిస్టులకు పెద్ద నష్టం జరిగింది. అంతేగాక పోలీసులు అటవీ ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. మావోయిస్టుల సంచార ప్రాంతాలపై పోలీస్‌డేగ కన్ను వేయడంతో ప్రస్తుతం జనజీవన స్రవంతిలో కలిసిపోయేందుకు ఇలా వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. తుళ్లూరు మండలంలోని అనంతవరం, దొండపాడు, తాళ్లాయపాళెం, పెద్దలంక ప్రాంతాల్లో వారి కదలికలు ఉండే అవకాశం ఉందనే సమాచారంతో నిఘా పెంచారు.

 

సీఎంకు లేఖతో మరింత అప్రమత్తం..

ఆంధ్రా, ఒడిషా బోర్డర్‌ ఎన్‌కౌంటర్‌కు సీఎం చంద్రబాబును బాధ్యుడ్ని చేస్తూ మావోయిస్టుల రాష్ట్ర కమిటీ లేఖను విడుదల చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. సీఎంతోపాటు వారి కుటుంబ సభ్యులను టార్గెట్‌ చేస్తూ ఆత్మాహుతి దాడులకు పాల్పడతామని లేఖలో పేర్కొనడంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. సీఎం, మంత్రులు రాజధాని ప్రాంతంలో తరచూ పర్యటిస్తుంటారు.. ఈ నేపథ్యంలో వారికి రక్షణ కల్పించడం పోలీసులకు పెద్ద కష్టంగా ఉంటుంది. రాజధాని పల్లెల్లో సానుభూతిపరులు ఉండటంతో ప్రభుత్వాధినేతల పర్యటనలను ఎప్పటికప్పుడు వారి ద్వారా తెలుసుకోనే అవకాశముంది. నిఘా వర్గాలు కాస్త ఏమరుపాటుగా ఉన్నా మావోయిస్టులు చెలరేగుతారు.

 

టెక్నాలజీ సాయంతో..

ఆధునిక టెక్నాలజీని వాడుకోనేందుకు పోలీస్‌ యంత్రాంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే టెక్నాలజీని అన్ని విధాలా వినియోగించుకుని విజయవంతమయ్యారు. పుష్కరాల్లోనూ ఇదే టెక్నాలజీతో ప్రజలకు రక్షణ కల్పించారు. విజయవాడలో సీసీ కెమెరాలతో నిఘాను పెంచారు. తుళ్లూరును పోలీస్‌ డివిజన్‌ కేంద్రంగా చేయనున్నారు. ఈ డివిజన్‌లో రాజధాని ఉండడంతో ప్రత్యేకSనిఘా ఉంచాలి. ఈ డివిజన్‌లో కూడా టెక్నాలజీని వాడుకోనున్నారు.
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top