చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన రుణమాఫీ హామీ మహిళల పాలిట శాపంగా మారింది.
డ్వాక్రా మహిళలకు కోర్టు నోటీసులు
లోక్ అదాలత్ ద్వారా బకాయిల వసూలుకు చర్యలు
కళ్యాణదుర్గం : చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన రుణమాఫీ హామీ మహిళల పాలిట శాపంగా మారింది. రుణమాఫీ అవుతుందని అప్పు చెల్లించని డ్వాక్రా మహిళలకు బ్యాంకుల ద్వారా నోటీసులు అందడంతో కోర్టు మెట్లెక్కాల్సి వస్తోంది. కళ్యాణదుర్గం పట్టణంలోని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) బ్రాంచ్‌లో రుణం పొందిన దాదాపు 75 మహిళా సంఘాల సభ్యుల నుంచి వన్‌టైం సెటిల్‌మెంట్ కింద రూ.38 లక్షల బకాయిల రికవరీ కోసం అధికారులు జాతీయ లోక్‌అదాలత్‌ను ఆశ్రయించారు. జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆవరణలో శనివారం జరిగిన జాతీయ లోక్‌అదాలత్‌కు బాధిత మహిళా సంఘాల సభ్యులు హాజరయ్యారు. లోక్‌అదాలత్‌లో ఇన్‌చార్జ్ జడ్జి అప్పలస్వామి, బ్యాంక్ మేనేజర్ నాగేశ్వరరావు, బాధిత మహిళా సంఘాల సభ్యులు రాజీ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రుణమాఫీ హామీ నమ్మి మోసపోయామని, ఎస్‌బీఐలో మహిళా సంఘం రుణానికి అధిక వడ్డీ వసూలు చేస్తున్నారని సంఘం సభ్యులు వాపోయారు.
బకాయిల వసూలు కోసమే..
మహిళా సంఘాల సభ్యులు బ్యాంకులో తీసుకున్న రుణాలు పూర్తిస్థాయిలో చెల్లించలేదు. లోక్‌అదాలత్‌లో రాజీ మార్గం ద్వారా బకాయిల సమస్యల పరిష్కారం కోసమే ప్రయత్నిస్తున్నాం. అంతకు మించి మహిళలను కోర్టుకు పిలిపించాలనేది మా అభిమతం కాదు. అధిక వడ్డీలు వసూలు చేశామని చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదు.
– నాగేశ్వరరావు, ఎస్‌బీఐ మేనేజర్, కళ్యాణదుర్గం