విజయవాడలోని కన్వెన్షన్ సెంటర్‌లో ఈ నెల 28, 29 తేదీల్లో కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరుగనుంది.
హైదరాబాద్: విజయవాడలోని కన్వెన్షన్ సెంటర్‌లో ఈ నెల 28, 29 తేదీల్లో కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరుగనుంది. 28వ తేదీ ఉదయం 10 గంటలకు కాన్ఫరెన్స్ ఆరంభమవుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగనున్న ఈ సదస్సులో వివిధ అంశాలను సమీక్షిస్తారు. కలెక్టర్ల సదస్సుల్లో ప్రధానంగా కమాండ్ కంట్రోల్, సీసీ కెమెరాలు, డ్రోన్‌ల వినియోగంపైనే సమీక్షించనున్నారు. ప్రతీ జిల్లాలో కమాండ్ కంట్రోల్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. అలాగే సీసీ కెమెరాలు, డ్రోన్‌ల ద్వారా పలు రంగాలను సమీక్షించేందుకు చర్యలు తీసుకోవడంపై ప్రధానంగా చర్చించనున్నారు.
రాష్ట్ర భూ పరిపాలన ప్రధాన కమిషనర్ అనిల్ చంద్ర పునేత కలెక్టర్ల కాన్ఫరెన్సు ఉద్దేశాన్ని సంక్షిప్తంగా వివరిస్తారు. ఉప ముఖ్యమంత్రి కేఈ కష్ణమూర్తి ప్రారంభోపన్యాసం చేస్తారు. వివిధ రంగాలు, జిల్లాల్లో డబుల్ డిజిట్ గ్రోత్, వరదలు, రబీ పంటల సాగుకు సన్నద్ధత తదితర అంశాలపై చర్చిస్తారు. ఆయా శాఖల కార్యదర్శులు తమ శాఖల్లో పరిస్థితి, వృద్ధిపై పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇస్తారు. 29వ తేదీ సాయంత్రం అయిదు గంటల నుంచి ఆరు గంటల వరకూ శాంతిభద్రతలపై జిల్లాల ఎస్పీలు, కలెక్టర్లతో సమీక్షిస్తారు.