సాక్షి, రాజమహేంద్రవరం :
గుంటూరు జిల్లా వాసి భాస్కరుణి సత్య జగదీష్. ఉద్యోగ రీత్యా మూడేళ్ల నుంచి రాజమహేంద్రవరంలో ఉంటున్నారు. ఓ పక్క పోలీసు శాఖలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే తీరిక సమయంలో జిల్లాల వారికి కూడా తెలియని సమాచారాన్ని ఆయన సేకరించారు. ఆ సమాచారాన్నంత ’గోదారి గట్టోళ్లు గట్సున్న గొప్పోళ్లు’ పేరుతో పుస్తకం రూపంలో పొందుపరిచారు. గతవారం హైదరాబాద్‌లో దర్శక రత్న, జిల్లా వాసి దాసరి నారాయణ రావు చేతులమీదుగా ఆ పుస్తకాన్ని ఆవిష్కరింపజేశారు. సమాచారం సేకరించడానికి పురికొల్పిన భావనలు, పుస్తకంలోని విశేషాలను ఆయన ’సాక్షి’తో పంచుకున్నారు. వివరాలు ఆయన మాటల్లోనే..
పుస్తక రచనకు దారితీసిన అంశాలు
సినీరంగంలో ఉభయగోదావరి జిల్లాల వారే అధికం. నటులు, ఆర్టిస్టులు, టెక్నిషియన్లు ఇలా అన్ని విభాగాల్లో దాదాపు 500 మంది ఉన్నారు. వారందరి వివరాలు, ఇక్కడ తీసిన చిత్రాల సమాచారం సేకరించాను. వాటిని ’గోదారి గట్టోళ్లు గట్సున్న గొప్పోళ్లు’ పేరుతో పుస్తకం రూపంలో తెచ్చాను.
పుస్తకంలోని అంశాలు
ఈ జిల్లాలో పుట్టిన వాళ్లు, మూల పురుషులు, వారి తరాల వాళ్లు, ఇక్కడ స్థిరపడిన వారు.. ఇలా ఈ నేలతో అనుబంధం ఉండి సినీ రంగంలో ఉన్న వారందరి సమాచారం, చిత్రాలు పుస్తకంలో పొందుపరిచాను. సినీ హీరోలు, హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, దర్శకులు, నిర్మాతలు, సినీ గేయ ర చయితలు, గాయకులు, సంగీత దర్శకులు, సినిమాటోగ్రఫీ.. ఇలా ఆయా విభాగాల్లో ఉన్న గోదావరి జిల్లాల వారి చిత్రాలు, పేర్లు ప్రచురించాను. ఉయ్యాల జంపాల, ఉయ్యాల జంపాల(పాతది) చిత్రాల నుంచి నేటి వరకు గోదావరి జిల్లాల్లో చిత్రీకరణ జరుపుకొన్న చిత్రాల పేర్లతో సహా ముద్రించాను.
ఇతర రచనలు
ఎస్పీ బాల సుబ్రమణ్యం జీవితంపై ’బహుముఖ ప్రజ్ఞశాలి బాలు’ పేరుతో పుస్తకం రచించాను. ఆయన పాడిన గీతాలల్లో ఆదరణ చూరగొన్న వాటిని సేకరించి ’బాలు భలే గీతాలు’ పేరుతో పుస్తకం ప్రచురించాను. మధ్యతరగతి కుటుంబాల మానసిక సంఘర్షణలను ఆవిష్కరిస్తూ ’క్రికెట్ అండ్ లవ్’ పేరుతో నవల రాశాను. దీనిని సినిమాగా చిత్రీకరించే ప్రయత్నంలో క్రియేటివ్ కమర్షియల్ అధినేత కె.ఎస్, రామారావు ఉన్నారు. గత ఏడాది పుష్కరాల సందర్భంగా గోదావరి జిల్లాలో ఉన్న ప్రదేశాలు, తినుబండారాలు, పాపికొండల అందాలు, మన సంప్రదాయాలను రుచి చూపించే హోటళ్లు వివరాలతో ’ కలయో.. గోదావరి మాయో’ నవల రచించాను.
కుటుంబ నేపథ్యం
మాది గుంటూరు జిల్లా వినుకొండ. నాన్న భాస్కరుణి వెంకట గోపాలరావు, అమ్మ సుబ్బలక్ష్మమ్మ. కళాశాల చదువు ఒంగోలు బీబీఎంవీవీఎం కాలేజీల్లో సాగింది. అనంతరం పోలీసు శాఖలో ఉద్యోగం వచ్చింది. రాజమహేంద్రవరం ఎస్పీ కార్యాలయానికి ఏవోగా పదోన్నతిపై వచ్చేంత వరకు హైదరాబాద్ డీజీపీ కార్యాలయంలో వివిధ హోదాల్లో పని చేశాను. నా పుస్తకాలకు తొలి పాఠకురాలు నా భార్య సి.మీనాకుమారి. ఇద్దరు కుమారులు. పెద్దాబ్బాయి సంతోష్ ప్రభుత్వ ఉద్యోగి కాగా చిన్నాబ్బాయి సాయి చరణ్ సినీ గాయకుడుగా రాణిస్తున్నాడు.
ఘంటశాల జీవితంపై సినిమా తీయాలి
గాయకుడు, సంగీత దర్శకుడిగా మాత్రమే ఘంటశాల అందరికీ తెలుసు. కానీ స్వతంత్య్ర సంగ్రామంలో ఆయన పాల్గొన్నారు. రాజమహేంద్రవరంతోపాటు పలు ప్రాంతాల్లో జైలు జీవితం గడిపారు. ఆ అంశాలతో ’గాంధీ మార్గంలో ఘంటశాల’ పేరుతో తీసిన షార్ట్ ఫిల్మ్ దూరదర్శ¯ŒSలో ప్రసారమైంది. ఘంటశాల జీవితంపై సినిమా, సీరియల్ నిర్మించాలి. అందుకు సంబంధించని స్క్రిప్ట్ సిద్ధంగా ఉంది. ఎవరైనా నిర్మాత వస్తే మొదలు పెడతాను. ఉద్యోగ విరమణ తర్వాత డైరెక్ష¯ŒSపై దృష్టి పెడతాను.