తెలంగాణలో అన్ని కులాలను కలుపుకుని పాలన సాగిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను చూసి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలన చేయడం నేర్చుకోవాలని తెలంగాణ కాపు ఫోరం రాష్ట్ర నాయకుడు లక్కినేని సుధీర్ హితవు పలికారు.
మామిళ్లగూడెం: తెలంగాణలో అన్ని కులాలను కలుపుకుని పాలన సాగిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను చూసి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలన చేయడం నేర్చుకోవాలని తెలంగాణ కాపు ఫోరం రాష్ట్ర నాయకుడు లక్కినేని సుధీర్ హితవు పలికారు. ఆదివారం ఖమ్మం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాపుల సమస్యల పరిష్కారం కోసం, కాపులకు రిజర్వేషన్ సాధించేందుకు ఏపీలో దీక్ష చేపట్టిన మాజీమంత్రి ముద్రగడ పద్మనాభానికి తెలంగాణ కాపు సంఘం సంపూర్ణ మద్దతు పలుకుతోందని తెలిపారు.
2014 అసెంబ్లీ ఎన్నికల్లో తాను అధికారంలోకి వస్తే కాపు, మున్నూరుకాపు, శెట్టిబలిజ తదితర కులాలను బీసీ కేటగిరిలో చేర్చుతానని చంద్రబాబు హామీ ఇచ్చారని, కానీ, అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీని తుంగలో తొక్కారని ఆరోపించారు. ఫలితంగానే ఏపీలో కాపులు రోడ్డెక్కాల్సిన దుస్థితి తలెత్తిందని తెలిపారు. శాంతి యుతంగా దీక్ష చేస్తున్న ముద్రగడతోపాటు కుటుంబీకులను పోలీసులు విచక్షణా రహితంగా ఈడ్చుకెళ్లి వ్యానులో ఎక్కించడం హేయమైన చర్య అని అన్నారు.
ఎమ్మెల్యే బొండా ఉమా తన స్థాయిని మరిచి చిరంజీవిపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. చిరంజీవి దయతో ఎమ్మెల్యేగా గెలిచిన గంటా శ్రీనివాసరావు నోరుమెదపకపోవడం శోచనీయమన్నారు. నిజంగా ఆయన కాపు బిడ్డ అయితే ఏపీలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై కాపులకు అండగా ఉండాలని సూచించారు. సమావేశంలో తెలంగాణ కాపు ఫోరం రాష్ట్ర నాయకులు కొమ్మినేని అంజయ్య, రంగయ్య, పెద్దబోయిన శ్రీనివాసరావు, పాపినేని నాగేశ్వరరావు, వెంకట్రామయ్య, నరసింహారావు, రామకృష్ణ, బయ్యవరపు నరేందర్, హరి తదితరులు పాల్గొన్నారు.