గుంటూరు జిల్లాలో బాంబుల కలకలం

గుంటూరు జిల్లాలో బాంబుల కలకలం - Sakshi

* పోలీసుల అదుపులో కొనుగోలుదారులు

తయారీదారుల కోసం గాలింపు

 

రొంపిచర్ల: గుంటూరు జిల్లాలో పోలీసులు స్వాధీనం చేసుకొన్న నాటుబాంబుల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నాటుబాంబులను రొంపిచర్ల మండలంలో తయారుచేసి ఇతర మండలాలకు సరఫరా చేస్తున్నట్లు తెలస్తోంది. బాంబులు తయారుచేసి  విక్రయించడమే కాకుండా అవసరం లేకపోతే తిరిగి అప్పజెప్పి  డబ్బు ఇచ్చే విధంగా కూడా బాంబుల వ్యాపారం జరుగుతుందంటే బాంబుల తయారీ ఏ స్థాయిలో జరుగుతుందో దీనిని బట్టి తెలుస్తోంది. సోమవారం పోలీసులు పట్టుకున్న బాంబుల విలువ రూ.14 వేలు. ఈ బాంబులు కొనుగోలు చేసిన ములకలూరు గ్రామస్తులకు అవసరం లేకనో, బాంబులలో నాణ్యత లేదనో తయారుచేసిన అమ్మకందారులకు తిరిగి అప్పజెప్పే క్రమంలో పోలీసులకు పట్టుబడ్డారు. బాంబులు తిరిగి తీసుకొని డబ్బులు ఇవ్వడం ఇష్టంలేని తయారీదారులు డబ్బు ఎగనామం పెట్టాలనే ఉద్దేశంతో పోలీసులకు సమాచారం ఇచ్చి ఉండవచ్చునని కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

 

పోలీసుల అదుపులో ఉన్న ఐదుగురు వ్యక్తులు బాంబులు సరఫరా చేసినవారి వివరాలను కూడా తెలిపారు. దీంతో అనుమానితుల్లో ఒకరైన రొంపిచర్లకు చెందిన ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాంబులు తీసుకెళుతున్న వ్యక్తులను విప్పర్లపల్లి, వడ్లమూడివారిపాలెం గ్రామాల మధ్య పొలంలో పట్టుకున్నారు. ఈ ప్రదేశం సుబాబుల్‌ తోటలతో అడవిని తలపించే విధంగా ఉండి తయారీదారులకు అనుకూలంగా ఉంది. ఈ ప్రాంతంలోని వారే బాంబులు తయారుచేసి ఉండవచ్చునని అనుమానంతో ఆ కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.  ఈ ప్రదేశంలో మంగళవారం పోలీసులు సోదాలు నిర్వహించారు. బాంబుల కొనుగోలుదారులు పోలీసుల అదుపులో ఉండడం వలన అమ్మకందారులు అందరినీ పట్టుకోవడం పోలీసులకు పెద్ద పనేం కాకపోవచ్చు.
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top