ఏటూరునాగారం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు.. బెల్లం.. ఇసుక.. లిక్కర్ దందాలో ఆరితేరిన వలీబాబా తాజాగా గంజాయి రవాణా చేస్తూ పట్టుబడ్డాడు.
హన్మకొండ, సాక్షి : ఏటూరునాగారం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు.. బెల్లం.. ఇసుక.. లిక్కర్ దందాలో ఆరితేరిన వలీబాబా తాజాగా గంజాయి రవాణా చేస్తూ పట్టుబడ్డాడు. ఇన్నోవా వాహనంలో గంజాయిని తరలిస్తూ ఖమ్మం జిల్లా పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం వద్ద పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. ఈ సంఘటన ఏజెన్సీ ఏరియాలో చర్చనీయాంశమైంది. అడ్డూఅదుపు లేకుండా చాటుమాటుగా సాగే అక్రమ వ్యాపారాలకు వలీబాబా పెట్టింది పేరు.
అధికార పార్టీ పెద్దల అండదండలు.. పోలీసుల కనుసన్నల్లోనే నల్లబెల్లం వ్యాపారంలో ఈయన పాతుకుపోయాడు. మరోవైపు తాడ్వాయి మండలం నుంచి ఇసుక రవాణా, ఏటూరునాగారం కేంద్రంగా లిక్కర్ వ్యాపారాలన్నింటినీ శాసించే స్థాయికి ఎదిగాడు. ఇటీవల ఏకంగా అతడికి ఏటూరునాగారం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఇచ్చి కాంగ్రెస్ నాయకులు భక్తిని చాటుకున్నారు. తాజాగా గంజాయి కేసులో వలీబాబా ఇరుక్కోవడంతో ఆ పార్టీ శ్రేణులకు మింగుడుపడడం లేదు. వలీబాబా ములుగు మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్యకు ముఖ్యఅనుచరుడిగా చెలామణిలో ఉన్నారు.
భద్రాచలం నుంచి 3 కిలోల గంజాయిని ఏటూరునాగారం తీసుకొస్తూ వలీబాబాతోపాటు అతడి అనుచరుడు గౌస్‌పాషా పోలీసులకు చిక్కారు. ఖమ్మం జిల్లా పోలీసులు వారిద్దరిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. మరోవైపు వలీబాబాను కాపాడేందుకు స్వయంగా ఓ మంత్రి రంగంలోకి దిగినట్లు ప్రచారం జరుగుతోంది. అక్రమ దందాలు నిర్వహిస్తున్న వలీబాబా పద్ధతి మార్చుకోవాలని.. లేకుంటే శిక్ష తప్పదని ఇప్పటికే పలుమార్లు మావోయిస్టులు హెచ్చరికలు జారీ చేశారు. తన వ్యాపారాలను కాపాడుకునేందుకు వలీబాబా కాంగ్రెస్ పార్టీలోనూ చురుగ్గా పనిచేస్తున్నాడనే వాదనలున్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి బలరాంనాయక్‌కు దగ్గరయ్యాడని.. బహుమతిగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి అందుకున్నట్లు పార్టీ కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.