ప్రభుత్వ పాఠశాలలను మూసివేస్తే ప్రజా ఉద్యమం తప్పదని ఆంధ్రప్రదేశ్ విద్యాపరిరక్షణ కమిటీ హెచ్చరించింది.
విజయనగరం: ప్రభుత్వ పాఠశాలలను మూసివేస్తే ప్రజా ఉద్యమం తప్పదని ఆంధ్రప్రదేశ్ విద్యాపరిరక్షణ కమిటీ హెచ్చరించింది. సోమవారం స్థానిక కలెక్టరేట్ ఎదుట ఏపీటీఎఫ్ సంయుక్త నిర్వహణలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో సభ్యులు మాట్లాడుతూ, విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందనే కారణంతో పాఠశాలలను మూసివేయడం తగదన్నారు.
అరకొరగా పాఠ్యపుస్తకాలు సరఫరా చేయడం, పౌష్టికాహారం పంపిణీలో అవకతవకలు వంటి కారణాలు చూస్తే ప్రభుత్వం కావాలనే పాఠశాల విద్యను నాశనం చేస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. గ్రామ సభల ఆమోదం లేకుండా ఏ ఒక్క ఆవాస ప్రాంతంలో కూడా పాఠశాలలను తొలగించరాదన్నారు. ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు డి.ఈశ్వరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఏపీ సేవ్ ఎడ్యుకేషన్ జిల్లా కన్వీనర్ జేసీ రాజు, కో-కన్వీనర్ కొల్లి సత్యం, ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు డి.ఈశ్వరరావు, అదనపు కార్యదర్శి సీహెచ్‌వీఎస్‌ఎన్ మూర్తి, సీహెచ్ వెంకటరమణ, కె.శ్రీనివాసరావు, ఆర్.చంద్రశేఖర్ నాయుడు, సూర్యారావు, చినసత్యం, అప్పారావు, నాగేశ్వరరావు, పైడితల్లి, తదితరులు పాల్గొన్నారు.