ఇంజినీరింగ్‌కు జీ-2 ప్రశ్నాపత్రం ఎంపిక | Sakshi
Sakshi News home page

ఇంజినీరింగ్‌కు జీ-2 ప్రశ్నాపత్రం ఎంపిక

Published Fri, Apr 29 2016 7:19 AM

ఇంజినీరింగ్‌కు జీ-2 ప్రశ్నాపత్రం ఎంపిక

కాకినాడ: ఏపీ ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షకు సెట్‌ కోడ్ జీ-2 ప్రశ్నాపత్రాన్ని మంత్రి గంటా శ్రీనివాసరావు ఎంపిక చేశారు. ఏపీ ఇంజినీరింగ్ అగ్రికల్చర్ మెడికల్ కామన్ ఎంట్రన్సు టెస్టు (ఎంసెట్)-2016 పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మంత్రి గంటా తెలిపారు. కాకినాడలో శుక్రవారం ఉదయం 6 గంటలకు సెట్ కోడ్‌ ఎంపిక కార్యక్రమంలో డిప్యూటీ సీఎం చినరాజప్ప, మంత్రి కామినేని శ్రీనివాస్, సాంకేతిక విద్యాశాఖ కార్యదర్శి, అధికారులు పాల్గొన్నారు.

శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఇంజినీరింగ్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మెడికల్, అగ్రికల్చర్ విభాగాల పరీక్షలు జరుగుతాయి. ఇంజనీరింగ్ విభాగంలో ఏపీలో 329, హైదరాబాద్‌లో 26 మొత్తం 355 పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేశారు. మెడికల్, అగ్రికల్చర్ విభాగానికి ఏపీలో 165, తెలంగాణలో 26 కేంద్రాలు ఏర్పాటుచేశారు. శుక్రవారం జరగనున్న ఏపీ ఎంసెట్‌కు 2,92,507 మంది హాజరుకానున్నారు. ఇంజినీరింగ్‌లో 1,89,273 మంది, మెడికల్‌లో 1,03,234 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు.

తెలంగాణ నుంచి ఏపీ ఎంసెట్‌కు పెద్ద సంఖ్యలో విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారు. ఎంసెట్ కేంద్రాల వద్ద కంప్యూటర్ సెంటర్లు, జిరాక్సు సెంటర్లు హోటళ్లను మూసివేయించేలా ఆదేశాలు జారీచేశామని, అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించామని అధికారులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం వెబ్‌సైట్‌లో ప్రిలిమినరీ కీ ఉంచుతామని, అభ్యంతరాలు ఉంటే మే 4 సాయంత్రంలోగా తెలపవచ్చని, మే 9న ఫైనల్ కీతో పాటు ర్యాంకులు వెల్లడిస్తామని ఎంసెట్ చైర్మన్ ప్రొఫెసర్ వీఎస్‌ఎస్ కుమార్, కన్వీనర్ ప్రొఫెసర్ సీహెచ్ సాయిబాబు తెలిపారు.

Advertisement
Advertisement