విద్యార్థుల సంఖ్య 50లోపు ఉన్న ప్రభుత్వ వసతి గృహాలను తొలగించి, వాటిలో ఉన్న విద్యార్థులను గురుకుల
కాట్రేనికోన : విద్యార్థుల సంఖ్య 50లోపు ఉన్న ప్రభుత్వ వసతి గృహాలను తొలగించి, వాటిలో ఉన్న విద్యార్థులను గురుకుల పాఠశాలలకు తరలించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. సాంఘిక సంక్షేమశాఖ వసతి గృహాల్లో విద్యార్థుల సంఖ్య తక్కువ ఉందనే సాకుతో ప్రభుత్వం గతేడాది 24 వసతి గృహాలను తొలగించి మూసివేసింది.
దీంతో జిల్లాలో 94 సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాలు మాత్రమే మిగిలాయి.
2016-17 విద్యాసంవత్సరంలో 50లోపు విద్యార్థులున్న 22 ఎస్సీ, 15 బీసీ వసతి గృహాలను తొలగించేందుకు ఉన్నతాధికారుల ఆదేశాలతో జాబితాను సిద్ధం చేసి ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారు.
నియోజకవర్గంలో కాట్రేనికోన, కందికుప్ప ఎస్సీ వసతి గృహాలు, ముమ్మిడివరం ఎస్సీ బాలుర, తాళ్లరేవు బీసీ వసతి గృహాలు తొలగించే జాబితాలో ఉన్నాయని సమాచారం. అయితే తొలగించబోయే వసతి గృహ విద్యార్థులకు సరిపడా సీట్లు గురుకుల పాఠశాలలో లేకపోవడం, ప్రభుత్వం నుంచి కచ్చితమైన ఆదేశాలు అందకపోవడంతో వసతి గృహ సంక్షేమ అధికారులు తర్జనభర్జన పడు తున్నారు.
మరికొన్ని రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. అయితే విద్యార్థుల అడ్మిషన్‌కు సంబంధించి ప్రభుత్వం నుంచి కచ్చితమైన ఆదేశాలు అందక సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. వసతి గృహాలను రక్షించుకునేందుకు నూరుశాతం అడ్మిషన్ల కోసం వసతి గృహ అధికారులు పరుగులు తీస్తున్నారు.
తొలగిస్తే సహించేది లేదు
వసతి గృహాలను మండల కేంద్రాల నుంచి తొలగిస్తే సహించేది లేదని తల్లిదండ్రులు హెచ్చరిస్తున్నారు. దీనిపై సాంఘిక సంక్షేమ శాఖ డీడీ శోభారాణిని వివరణ కోరగా.. ‘‘ప్రభుత్వం నుంచి ఈ ఏడాదికి ఏవిధమైన ఆదేశాలు లేవు. విద్యార్థుల సంఖ్య ఉన్న వసతి గృహాల ప్రపోజల్స్ పంపించాం. రెసిడెన్సీ స్కూల్స్‌లో అంత వేకెన్సీ లేదని చెప్పారు. దీనిపై ప్రస్తుతానికి అడగలేదు. నూరు శాతం విద్యార్థులను చేర్పిస్తే తొలగింపు ఉండక పోవచ్చు. నూరు శాతం అడ్మిషన్లు చేయాలని వసతి గృహ అధికారులకు ఆదేశించాం’’ అని అన్నారు.