బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ వెల్ఫేర్ బోర్డు నిధులను మళ్లీంచడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఏఐటీయూసీ, సీఐటీయూసీ జిల్లా నేతలు పేర్కొన్నారు.
► 25న చలో విజయవాడను విజయవంతం చేయాలి
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ వెల్ఫేర్ బోర్డు నిధులను చంద్రన్న బీమాకు మళ్లీంచడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఏఐటీయూసీ, సీఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శులు మునెప్ప, నాగేశ్వరరావు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వెల్ఫేర్ బోర్డుకు చెందిన 234 కోట్ల రూపాయలను చంద్రన్న బీమాకు తరలించారని, వాటిని వెంటనే తిరిగి అప్పజెప్పాలని పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించిన పట్టించుకోవడం లేదన్నారు. దీంతో కార్మిక సంఘాల ఐక్యమత్యంతో ఉద్యమానికి పిలుపునిచ్చాయని, అందులో భాగంగా ఈనెల 25న చేపట్టే చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు.
శనివారం కేకే భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ..40 ఏళ్లు పోరాటం చేసి సాధించుకున్న బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ వెల్ఫేర్ బోర్డును నిర్వీర్యం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ధ్వజమెత్తారు. రూ.117 కోట్లను చంద్రన్న బీమా ప్రచారం కోసం వాడుకోవడం దారుణమన్నారు. అలాగే 234 కోట్లను ఇతర పనులకు మళ్లీంచారని ఆరోపించారు. ఈ నిధులను వెల్లేర్ బోర్డుకు తిరిగి అప్పగించాలని, ప్రతీ కార్మికుడికి రూ.3000 పెన్షన్ ఇవ్వాలని కోరుతూ చేపడుతున్న చలో విజయవాడ కార్యక్రమానికి జిల్లా నుంచి వందల సంఖ్యలో కార్మికులు హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు నరసింహులు, రాముడు పాల్గొన్నారు.