ప్రక్షాళన మొదలు.. | Sakshi
Sakshi News home page

ప్రక్షాళన మొదలు..

Published Wed, Sep 14 2016 11:14 PM

ప్రక్షాళన మొదలు..

  • భద్రాద్రి ఆలయంలో 45 మంది సిబ్బందికి స్థాన చలనం, 
  • ఔట్‌ సోర్సింగ్‌ వారిపై తొలివేటు
  • ఈఓ అత్యవసర సమావేశం, నగల మాయంపై చర్యలకు వెనుకంజ
  • అధికారుల తీరుపై ఉద్యోగవర్గాల్లో వ్యతిరేకత
  •  
    భద్రాచలం: శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో విధుల పట్ల అలసత్వం వహిస్తున్న సిబ్బందిని గాడిలో పెట్టేందుకు దేవస్థానం ఈఓ రమేష్‌బాబు దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే 45 మంది ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందికి స్థానభ్రంశం కల్పిస్తూ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. సరైన నియంత్రణ లేకపోవటంతో కొందరు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఒకింత కఠినంగానే వ్యవహరించేందుకు సిద్ధమయ్యారు.
    జరిమానా విధించి..
    మెమో జారీ చేసి..
     భక్తుల కానుకులను నమోదు చేసే పుస్తకాన్ని భద్రపర్చలేదనే కారణంతో జూనియర్‌ అసిస్టెంట్‌ సత్యనారాయణకు రూ.5 వేలు జరిమానా విధించారు. ఆలయ సూపరింటెండెంట్‌ నర్సింహరాజు పర్యవేక్షణ లేమిని ఎత్తిచూపుతూ అతడికి మెమో జారీ చేశారు. ఏళ్ల తరబడి ఒకే చోట పాతుకుపోయిన ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది, ఆలయ విధులను పక్కనపెట్టి సొంతకార్యాలకే పెద్ద పీట వేస్తున్నారనే కోణంలో ఈఓ ఈమేరకు చర్యలు తీసుకున్నారు. ఆలయంలో పనిచేస్తున్న వారిని, ఆలయ పరిసరాలు, కార్యాలయం వంటి చోట్లకు, అక్కడ విధులు నిర్వర్తిస్తున్న వారిని ఆలయ ప్రాంగణానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈఓ నిర్ణయంపై ఆలయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆలయ అర్చకుల్లో కొందరితో బుధవారం అత్యవసరంగా సమావేశమయ్యారు. ఇటీవల కాలంలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆలయ ప్రతిష్టకు భంగం వాటిల్లకుండా అర్చకులంతా బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించినట్లుగా తెలిసింది. ఈఓ చర్యలపై కొందరు ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పుస్తకం కనిపించలేదనే కారణంగా జరిమానా విధించటంతో పాటు, జూనియర్‌ అసిస్టెంట్‌ను వేరే చోటుకు బదిలీ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు. 
    • నగలు మాయమైనా చర్యల్లేవా..?
    • ఇప్పుడేమో కఠినంగా వ్యవహరిస్తారా..?
    సీతమ్మ వారి పుస్తెల తాడు, లక్ష్మణుడి లాకెట్‌ కనిపించకుండా పోయి..వారం రోజుల తర్వాత దొరికిన విషయం విదితమే. ఆలయంలో కీలకంగా వ్యవహరించే ఓ అర్చకుడు వాటిని మాయం చేశాడనే ఆరోపణలు పెద్దఎత్తున వినిపించాయి. ఈ ఘటనలో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు చర్యలు తీసుకోవడంపై ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఈ పరిణామాలు ఎటువైపు దారితీస్తాయోనని ఆలయ ఉద్యోగ, అర్చకుల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఉన్నత స్థాయిలో ఉన్న ఓ వ్యక్తి ఈ విషయంలో అర్చకుల పక్షాన కొమ్ము కాస్తున్నారనే ప్రచారం ఉన్నప్పటకీ, తప్పు చేసినవారెవరైనా సమానమే కదా అని ఇక్కడి ఉద్యోగుల వాదన.  

Advertisement
 

తప్పక చదవండి

Advertisement