ప్రాచీన భారతీయ వైద్యానికి రాష్ట్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. అక్కడ పనిచేసే ఉద్యోగులను పొమ్మనలేక పొగబెడుతోంది.
త్రిశంకుస్వర్గంలో ఆయుష్ ఉద్యోగులు
Aug 9 2016 12:22 AM | Updated on Sep 4 2017 8:25 AM
– ఏప్రిల్ నుంచి జీతాలు లేవు
– ఉద్యోగాలు రెన్యువల్ చేయొద్దని ఆదేశాలు
– అగమ్యగోచరంగా 41 మంది జీవితాలు
కర్నూలు(హాస్పిటల్):
ప్రాచీన భారతీయ వైద్యానికి రాష్ట్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. అక్కడ పనిచేసే ఉద్యోగులను పొమ్మనలేక పొగబెడుతోంది. ఆరునెలలుగా జీతాలు ఇవ్వక, రెన్యువల్ చేయక వేధిస్తోంది. ఫలితంగా తాము ఉద్యోగంలో ఉండాలో లేక వెళ్లిపోవాలో తేల్చుకోలేక ఉద్యోగులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. జిల్లాలో రెగ్యులర్ ఆయుష్ డిస్పెన్సరీలతో పాటు జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ కింద నిర్వహించే డిస్పెన్సరీలు 44 ఉన్నాయి. 2008లో 22, 2009లో 22 డిస్సెన్సరీలను ప్రారంభించారు. ప్రతి డిస్పెన్సరీల్లో ఒక మెడికల్ ఆఫీసర్, ఒక కాంపౌండర్, ఒక స్వీపర్ పోస్టులు మంజూరయ్యాయి. ఇక్కడ పనిచేసే మెడికల్ ఆఫీసర్లలో 19 మందిని 2012లో రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసి, రెగ్యులర్ డిస్పెన్సరీల్లో పోస్టింగ్ ఇచ్చింది. అప్పటి నుంచి వీరి వల్ల ఖాళీ అయిన ఎన్‌ఆర్‌హెచ్‌ఎం డిస్పెన్సరీలలో మెడికల్ ఆఫీసర్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయలేదు. ఫలితంగా ఇప్పటి వరకు అక్కడ కాంపౌండర్, స్వీపర్లే నెట్టుకొస్తున్నారు.
రెన్యువల్ చేయరు.. జీతాలు ఇవ్వరు
జిల్లాలోని ఆళ్లగడ్డ, గడివేముల, కోడుమూరు, కొలిమిగుండ్ల, మద్దూరు, యాళ్లూరు, దైవందిన్నె, గోకవరం, గోస్పాడు, హర్దగేరి, కలుదేవకుంట్ల, కొత్తబురుజు, డబ్లు్య. కొత్తపల్లి, పడిగిరాయి, పత్తికొండ, పలుకూరు, పెద్దకడుబూరు, చాగలమర్రి, కోవెలకుంట్ల, మిడుతూరు, పేరుసోముల, అవుకు డిస్పెన్సరీల్లో వైద్యులు లేరు. కాగా పలుకూరు, పెద్దకడుబూరు, అవుకులలో వైద్యులతో పాటు కాంపౌండర్, స్వీపర్ కూడా లేకుండా పోయారు. ఫలితంగా అవి ప్రస్తుతం మూతబడి ఉన్నాయి. వైద్యులు లేని డిస్పెన్సరీల్లో సిబ్బందికి గత ఏప్రిల్ నుంచి జీతాలు ఇవ్వడం లేదు. వీరికి రెన్యువల్ కూడా చేయవద్దని ఆయుష్ కమిషనర్ నుంచి గత నెల 27వ తేదీన ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో అక్కడ పనిచేసే ఉద్యోగులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. జీతాలు ఇవ్వక, ఉద్యోగాలను రెన్యువల్ చేయకుండా తమను ప్రభుత్వం వేధిస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక విధంగా రాష్ట్ర ప్రభుత్వం తమను పొమ్మనలేక పొగబెడుతున్నట్లుగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు.
Advertisement
Advertisement