చేతబడి చేస్తున్నావంటూ గ్రామస్తులు చేసిన ఆరోపణలతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.
చేతబడి చేస్తున్నావంటూ గ్రామస్తులు చేసిన ఆరోపణలతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం కనిమెట్ట గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి కాలు విపరీతంగా వాచిపోయింది. ఎన్ని వైద్యాలు చేసినా అది నయం కావటం లేదు. ఇదే సమయంలో సదరు వ్యక్తికి అదే వీధికి చెందిన కరగాల రాజారావు(65) తరచూ కలలో కనిపిస్తున్నాడు. తన కాలి వాపునకు రాజారావు చేసిన చిల్లంగి(చేతబడి) కారణమని కొద్ది రోజులుగా ఆరోపిస్తున్నాడు. ఇదే విషయమై కొందరు గ్రామస్తులతో కలిసి సోమవారం రాజారావును నిలదీశాడు. మనస్తాపం చెందిన రాజారావు మంగళవారం ఉదయం ఇంట్లోనే విషం తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే శ్రీకాకుళం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మధ్యాహ్నం చనిపోయాడు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.