8 నుంచి గడప గడపకు వైఎస్సార్‌సీపీ

8 నుంచి  గడప గడపకు   వైఎస్సార్‌సీపీ - Sakshi


నెల్లూరు ఎంపీ మేకపాటి   రాజమోహన్‌రెడ్డి

పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులకు  గుర్తింపు

  కార్డులు అందజేత


 

 

నెల్లూరు(సెంట్రల్):
గ్రామ స్థాయి నుంచి వైఎస్సార్‌సీపీని పటిష్టం చేసేందుకు, ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా  చేసిన మోసాలను ఎండగట్టేందుకు జూలై 8వ తేదీ నుంచి గడప గడపకు వైఎస్సార్‌సీపీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల, అనుబంధ సంఘాల నాయకులకు గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమం గురువారం వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో జరిగింది.





ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశానుసారం పార్టీని క్షేత్ర స్థాయిలో పటిష్ట పరిచేందుకు గడపగడపకు వైఎస్సార్‌సీపీ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో పెట్టిన ఏ ఒక్క అంశాన్ని కూడా సీఎం చంద్రబాబు అమలు చేయకపోవడం ప్రజలను నమ్మించి మోసం చేయడమేనని ధ్వజమెత్తారు. రైతులకు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతిలాంటి ఎన్నో హామీలను తుంగలో తొక్కడం సిగ్గుచేటన్నారు. కేంద్రంలో బీజీపీ, రాష్ట్రంలో టీడీప అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాని చెప్పిన చంద్రబాబు చేసింది శూన్యమన్నారు. రాష్ట్రానికి అవసరమైన ప్రత్యేక హోదా విషయంలో తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు.





  పార్టీలో ప్రతి ఒక్కరికీ గుర్తింపు

 వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ కాపుల సామాజిక సమస్యను శాంతి భద్రతల సమస్యగా మార్చిన ఘనత చంద్రబాబుదే అన్నారు. పార్టీలో ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఉంటుందన్నారు. జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, ఎమ్మెల్యేలు రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, పోలుబోయిన అనిల్‌కుమార్‌యాదవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, నెల్లూరు నగర అధ్యక్షుడు తాటి వెంకటేశ్వర్లు, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు రూప్‌కుమార్ యాదవ్, వైఎస్సార్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు శ్రావణ్, బీసీ విభాగం అధ్యక్షుడు భాస్కర్‌గౌడ్, రాష్ట్ర కార్యదర్శి సత్యనారాణరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి మెట్టా విష్ణువర్ధన్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సుకుమార్‌రెడ్డి, అధికార ప్రతినిధి కామరాజుతో పాటు పలువురు నాయకులకు ఎంపీ గుర్తింపు కార్డులు అందజేశారు.

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top