తప్పుడు పనులు చేయిస్తున్నారు..

Young Women Complaint to DCP on Beauty parlor in Hyderabad - Sakshi

డీసీపీకి ఇద్దరు యువతుల ఫిర్యాదు

పోలీసుల అదుపులో స్పా నిర్వాహకుడు

అమీర్‌పేట: బ్యూటీ పార్లర్‌లో ఉద్యోగం ఇస్తామని చెప్పి తప్పుడు పనులు చేయిస్తున్నారని, వేతనం అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఇద్దరు యువతులు పశ్చిమ మండలం డీసీపీ సుమతికి ఫిర్యాదు చేశారు. డీసీపీ ఆదేశాల మేరకు ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివరాల్లోకి వెళితే..అమీర్‌పేట ధరంకరం రోడ్డులో ప్రకాష్‌ అనే వ్యక్తి జయశ్రీ ఆయుర్వేదిక్‌ స్పా (మసాజ్‌) సెంటర్‌ నిర్వహిస్తున్నాడు. బ్యూటీ పార్లర్‌లో పనిచేసేందుకు యువతులు కావాలని ఓఎల్‌ఎక్స్‌లో ప్రకటనలు ఇచ్చాడు. అందుకు ఆసక్తి చూపిన ఇద్దరు యువతులకు నెలకు రూ.18 వేలు వేతనం ఇస్తామని చెప్పి పనిలో పెట్టుకున్నాడు. వారితో క్రాస్‌ మసాజ్‌ చేయించి రూ. 500 మాత్రమే ఇచ్చేవాడు. దీనిపై నిలదీయగా తప్పుడు పనులు చేస్తే రోజుకు రూ.2వేల నుంచి రూ.3వేల వరకు ఇస్తామని చెప్పాడు. అందుకు బాధితులు అంగీకరించకపోవడంతో గతంలో తీసిన ఫొటోలను మీ కుటుంబ సభ్యులకు పంపిస్తామని బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నట్లు వాపోయారు. తమకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా బెదిరింపులకు పాల్పడుతున్నట్లు డీసీపీకి ఫిర్యాదు చేశారు. తమ కుటుంబ పరిస్థితులు సరిగా లేనందునే ఉద్యోగం చేయాల్సి వచ్చిందని, అతడి బారి నుంచి తమకు విముక్తి కల్పించాలని కోరారు. బాధితుల ఫిర్యాదు మేరకు నిర్వాహకుడు ప్రకాష్‌ను అదుపులోకి తీసుకుని  దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్‌పెక్టర్‌ మురళీకృష్ణ తెలిపారు.  

పెళ్లి పేరుతో మోసం నిందితుడి అరెస్ట్‌
మల్కాజిగిరి: ఓ యువతిని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన వ్యక్తిని మల్కాజిగిరి పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేశారు. ఇన్‌స్పెక్టర్‌ మన్మోహన్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నాచారం, మల్లాపూర్‌కు చెందిన శ్రీపాద సాయినాథ్‌ ఉప్పల్‌లోని హెచ్‌పీసీఎల్‌ పెట్రోల్‌ పంపులో మేనేజర్‌గా పని చేస్తున్నాడు. గండిపేట్‌లోని ఓ రిసార్ట్‌లో ఈవెంట్‌ మేనేజర్‌గా పని చేస్తున్న మల్కాజిగిరికి చెందిన యువతితో ఏడాది కిత్రం అతడికి పరిచయం ఏర్పడింది. ఆమెను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆమె కుటుంబ సభ్యులను కూడా పరిచయం చేసుకుని తరచూ ఇంటికి వచ్చి వెళ్లేవాడు. పెళ్లి చేసుకోవాలని బాధితురాలు ఒత్తిడి చేయడంతో గత కొన్ని రోజులుగా ఆమెను దూరం పెడుతున్నాడు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు సాయినాథ్‌ , అతని సోదరుడిని పిలిచి మాట్లాడగా, ఈ ఏడాది మార్చి నెలలో చేసుకుంటానని చెప్పాడు. అదే నెలలో సాయినాథ్‌ పుట్టినరోజు సందర్బంగా అతడి ఇంటికి వెళ్లిన బాధితురాలు అతను మరో యువతితో చనువుగా ఉండటాన్ని గుర్తించి సాయినాథ్‌ను నిలదీసింది. దీంతో సాయినాథ్, అతని సోదరులు ఆమెకు నచ్చజెప్పి పంపారు. ఆమె క్రెడిక్‌ కార్డు వాడుకొని డబ్బులు తిరిగి ఇవ్వకపోగా, ఆమె సెల్‌ఫోన్‌ నంబర్‌ను బ్లాక్‌ లిస్ట్‌లో ఉంచడంతో బాధితురాలు అతడి ఆఫీసుకు వెళ్లి నిలదీయగా స్పందించలేదు. దీంతో తాను మోసపోయానని గుర్తించిన బాధితురాలు ఈ నెల 21న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  బుధవారం నిందితుడు శ్రీపాద సాయినాథ్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top