ఇలాగైతే ఎందుకు బతకాలి?

young person tried to suicide in allagadda - Sakshi

ప్రభుత్వ పథకాలేవీ అందలేదు

ఇల్లు, మరుగుదొడ్డి మంజూరు చేయకపోతే చచ్చిపోతా

నీళ్ల ట్యాంకుపైకెక్కి ఓ వ్యక్తి ఆందోళన

కర్నూలు జిల్లా అహోబిలంలో సంఘటన

ఆళ్లగడ్డ: ‘మేం నిరుపేదలం. ప్రభుత్వం నుంచి ఒక్క సంక్షేమ పథకం కూడా అందలేదు. ఇలాగైతే ఎందుకు బతకాలి’ అని ఆవేదన వ్యక్తం చేస్తూ కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం అహోబిలం గ్రామానికి చెందిన చాకలి నరసింహులు స్థానిక ఇందిరమ్మ కాలనీలోని ఓవర్‌హెడ్‌ ట్యాంకు పైకెక్కి నిరసన తెలిపాడు. వెంటనే ఇల్లు, మరుగుదొడ్డి మంజూరు చేయకపోతే ఇక్కడి నుంచి దూకి చచ్చిపోతానంటూ కేకలు వేశాడు. దీన్ని గమనించినవారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా కిందకు దిగేందుకు ససేమిరా అన్నాడు. ఎవరైనా పైకి వచ్చేందుకు ప్రయత్నిస్తే ఇక్కడి నుంచి దూకుతానని హెచ్చరించాడు.

కాలనీలో అనేక మందికి ఇళ్లు, ఇళ్ల స్థలాలు లేవని, కనీసం మరుగుదొడ్లు మంజూరు చేయడం లేదని వాపోయాడు. ఇవన్నీ ఇస్తామంటేనే ఇక్కడి నుంచి దిగుతానని, లేదంటే కిందకు దూకుతానని హెచ్చరించడంతోపాటు అనేకమార్లు దూకేందుకు ప్రయత్నించడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. విషయం తెలిసిన వైఎస్సార్‌సీపీ నాయకుడు, కేడీసీ బ్యాంక్‌ డైరెక్టర్‌ నాసారి వెంకటేశ్వర్లు, మాలోల అతిథి గృహ మేనేజర్‌ బద్రీనారాయణ్‌ అక్కడికి చేరుకుని నరసింహులుకు సర్దిచెప్పారు. అధికారులతో మాట్లాడామని, వెంటనే ఇల్లు, మరుగుదొడ్డి మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. దీంతో అతను కిందకు దిగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇంత జరిగినా అధికార పార్టీ నాయకులు, సంబంధిత అధికారులు అటువైపు కన్నెత్తిచూడకపోవడం గమనార్హం.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top