ఉద్యోగాల పేరుతో వల

Women Trafficking With Fake Jobs In Kurnool - Sakshi

భువనేశ్వర్‌కు తీసుకెళ్లి చిత్రహింసలు

నంద్యాల బాలికను చెర నుంచి విడిపించిన పోలీసులు

ఎవరూ మోసపోవద్దని డీఎస్పీ సూచన

కర్నూలు, నంద్యాల:  ఉద్యోగాల పేరుతో యువతులు, బాలికలకు వల వేసి..మోసాలకు పాల్పడుతున్న ఓ ముఠా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ ముఠా కబందహస్తాల్లో రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, చిత్తూరు,వైఎస్సార్, కర్నూలు జిల్లాలకు చెందిన పలువురు బాధితులు చిక్కుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. నంద్యాలకు చెందిన ఓ బాలికను ఉద్యోగం ఇప్పిస్తామంటూ తీసుకెళ్లి..అక్కడ చిత్రహింసలకు గురి చేశారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో అక్కడికి వెళ్లి చెర నుంచి విడిపించారు. ఇందుకు సంబంధించిన వివరాలను నంద్యాల డీఎస్పీ గోపాలకృష్ణ శుక్రవారం తన కార్యాలయంలో మీడియాకు వెల్లడించారు. 

పట్టణంలోని ఆటోనగర్‌కు చెందిన ఓ బాలికకు పట్టణానికే చెందిన సంధ్యా, మందిరా అనే మహిళలు పరిచయమయ్యారు. భువనేశ్వర్‌లోని గ్లేజ్‌ ట్రేడింగ్‌ ఇండియా ప్రైవేటు సంస్థలో ఉద్యోగాలు ఉన్నాయని, మంచి వేతనం, కారు, బంగ్లా ఇస్తారని మాయమాటలు చెప్పారు. ముందుగా రూ.30 వేలు కట్టాలనడంతో సదరు బాలిక ఆ మొత్తం చెల్లించింది. తర్వాత భువనేశ్వర్‌కు తీసుకెళ్లి అక్కడ రోజులు గడుస్తున్నా ఏ ఉద్యోగమూ చూపలేదు. కంప్యూటర్‌ నేర్పిస్తామని చెబుతూ వచ్చారు. కొన్నిరోజుల తర్వాత స్నేహితులకు ఫోన్లు చేసి ఇక్కడ వేతనం బాగుందని చెప్పి..వారినీ రప్పించాలని బలవంతం చేశారు. అంతటితో ఆగకుండా చిత్రహింసలకు గురి చేశారు.  దీంతో ఈ విషయాన్ని సదరు బాలిక నంద్యాలలోని తల్లిదండ్రులకు ఫోన్‌లో తెలియజేసింది. బాలిక తల్లి జిల్లా ఎస్పీ ఫక్కీరప్పను కలిసి ఫిర్యాదు చేసింది. ఎస్పీ ఆదేశాల మేరకు నంద్యాల డీఎస్పీ గోపాలకృష్ణ షీటీంను భువనేశ్వర్‌కు పంపారు. బాలికను చెర నుంచి విడిపించి తీసుకొచ్చారు. ఇలాంటి బాధితులు అక్కడ చాలా మంది ఉన్నట్లు తెలిసిందని డీఎస్పీ చెప్పారు. సదరు కంపెనీపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నామన్నారు. నిరుద్యోగుల బలహీనతను ఆసరాగా చేసుకొని  మోసాలకు పాల్పడే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top