కి‘లేడీ’ అరెస్ట్‌ | Sakshi
Sakshi News home page

కి‘లేడీ’ అరెస్ట్‌

Published Sun, Feb 17 2019 7:06 AM

Women Thief Arrest in Visakhapatnam - Sakshi

విశాఖపట్నం : అమె టిప్‌టాప్‌గా తయారవుతుంది. బ్యూటీపార్లర్‌లో పనిచేస్తున్నానని చెబుతుంది. మగవాళ్లను లిఫ్ట్‌ అడిగి, పరిచయం పెంచుకుంటుంది. తరువాత దొంగతనాలకు పాల్పడుతుంది. అటువంటి కి‘లేడీ’ని ఎంవీపీ క్రైం పోలీసులు శనివారం అరెస్టు చేశారు. అనకాపల్లికి చెందిన గౌరి నగరంలోని సీతంపేట జీవీఎంసీ పాఠశాల సమీపంలో నివసిస్తుంది. ఆమె గతంలో భర్తతో గొడవపడి విడాకులు తీసుకుంది. ఆమెకు ముగ్గురు పిల్లలున్నారు. విలాసాలకు అలవాటు పడిన గౌరి దొంగతనాలకు పాల్పడుతోందని పోలీసుల విచారణలో తేలింది.

శివాజీపాలెంలో నివసిస్తున్న పూసపాటి గోపాలకృష్ణ వర్మ (60) గతంలో కార్పొరేటర్‌గా పనిచేశారు. అతను కారులో వెళ్తుండగా మార్గమధ్యలో గుత్తుర్తి గౌరి (29) లిఫ్టు అడిగింది. దీంతో లిఫ్టు ఇచ్చిన వర్మ ఆమెతో కలిసి ఎంవీపీ కాలనీలో గల ఒక రెస్టారెంట్‌కి వెళ్లారు. కొంతసేపటికి వర్మ వాష్‌రూమ్‌కి వెళ్లగా అక్కడే ఉన్న కారు తాళాలు తీసుకుని గౌరి కారుతో సహా పరారైంది. దీంతో వర్మ ఎంవీపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఎంవీపీ క్రైం ఎస్‌ఐ సూరిబాబు పర్యవేక్షణలో టి.తులసీభాస్కర్, పి.నరేష్‌కుమార్, పీడీవీ ప్రసాద్‌ కలిసి గౌరిని అరెస్టు చేసి కారు స్వాధీనం చేసుకున్నారు. ద్వారకాజోన్‌ క్రైం సీఐ వి.బాబ్జీరావు పర్యవేక్షణలో కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement