ఫుట్‌బోర్డు..సెల్‌ఫోన్‌

Women Died MMts Train Foot Board Journey Hyderabad - Sakshi

ప్రాణం తీసిన ప్రయాణం

ఎంఎంటీఎస్‌ రైలు నుంచి జారిపడి యువతి మృతి

నాంపల్లి: ఎంఎంటీఎస్‌ రైలులో ఫుట్‌బోర్డు ప్రయాణం చేయడమే కాకుండా...సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ..కింద పడిన ఫోన్‌ను అందుకునే ప్రయత్నం చేస్తూ ఓ యువతి ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన నాంపల్లి రైల్వే పోలీసు స్టేషన్‌ పరిధిలోని బేగంపేట రైల్వే స్టేషన్‌కు సమీపంలో చోటుచేసుకుంది. జీఆర్పీ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ తెలిపిన వివరాల ప్రకారం... సీతాఫల్‌మండి వీరలబస్తీకి చెందిన రామచందర్‌ కుమార్తె మాధవి అశ్విని(22) ప్రైవేట్‌ ఉద్యోగిని. ఈమె రోజూ ఎంఎంటీఎస్‌ రైలులోప్రయాణం చేస్తూ విధులకు వెళ్తుంటుంది. సికింద్రాబాద్‌ నుంచి లింగంపల్లికి ప్రయాణించే రైలులో సీతాఫల్‌మండి రైల్వే స్టేషన్‌ వద్ద ఎక్కి...ప్రకృతి చికిత్సాలయం రైల్వే స్టేషన్‌ వద్ద దిగుతుంటుంది. బుధవారం రోజు మాదిరిగా విధులకు బయలుదేరింది. రైలులో రద్దీ ఎక్కువగా ఉండటం చేత ఫుట్‌బోర్డు ప్రయాణం చేస్తోంది. ఇదే క్రమంలో మాధవి అశ్విని సెల్‌ఫోన్‌ మాట్లాడుతోంది. సెల్‌ఫోన్‌ మాట్లాడుతున్న సమయంలో ఫోన్‌ కిందపడింది.

అప్పుడే ఎంఎంటీఎస్‌ రైలు ఒక పట్టా నుంచి మరో పట్టాకు క్రాసింగ్‌ జరుగుతోంది. సెల్‌ఫోన్‌ను అందుకోవడానికి కిందకు వంగడం, రైలు క్రాసింగ్‌ జరగడం ఒకే సమయంలో జరగడంతో ప్రమాదవశాత్తు జారి కిందపడింది. కిందపడ్డ యువతి రైలు చక్రాల కిందకు చేరుకుంది. దీంతో ఆమె దేహం రెండు ముక్కలుగా తెగిపోయింది. స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. శవపంచనామా నిర్వహించి ఉస్మానియా మార్చురీకి తరలించి పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. కాగా మాధవి అశ్వినికి వివాహం కాలేదు. ఫుట్‌బోర్డు ప్రయాణమే ఆమె మరణానికి కారణమైనట్లు పోలీసులు తెలియజేశారు.  ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top