ఇల్లు చూస్తానని వచ్చి.. | Sakshi
Sakshi News home page

ఇల్లు చూస్తానని వచ్చి..

Published Fri, Mar 15 2019 11:13 AM

Women Arrest in Gold Robbery Case - Sakshi

నాగోలు: అద్దెకు ఇల్లు కావాలని వచ్చి ఇంటి యజమానురాలికి చెందిన నల్లపూసల దండ, బంగారు ఉంగరం ఎత్తుకెళ్లిన మహిళను ఎల్‌బీనగర్‌ పోలీసులు అరెస్టు చేసి గురువారం రిమాండ్‌కు తరలించారు. డీఐ కృష్ణమోహన్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మీర్‌పేట నందనవనం కాలనీకి చెందిన ఆంజనేయులు కార్‌ షోరూంలో పని చేసేవాడు. అతని బార్య  వైష్ణవి అలియాస్‌ హబీబ గృహిణి. జీతం సరిపోకపోవడంతో వైష్ణవి చోరీలకు పాల్పడుతోంది. ఈ నెల 12న ఇద్దరూ కలిసి బైక్‌పై తిరుగుతూ న్యూ శివపురి కాలనీలో టులెట్‌ బోర్డు ఉన్న బిల్లపట్టి నర్సింహారెడ్డి ఇంటిని టార్గెట్‌ చేసుకున్నారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న నర్సింహారెడ్డి భార్యను కలిసి ఇల్లు అద్దెకు కావాలని పోర్షన్‌ చూపించాలని కోరారు.

ఆమె వారికి ఇంటిని చూపిస్తుండగా వైష్ణవి దృష్టి వంటగదిలో అలమరాలో ఉన్న నల్లపూసల దండ, బంగారు ఉంగరంపై పడింది. బయటికి వెళ్లిన కొద్ది నిమిషాల్లో తిరిగి వచ్చిన వైష్ణవి యజమానురాలితో కిచెన్‌ చూస్తానని చెప్పి లోపలికి వెళ్లి నల్లపూసల దండ, బంగారు ఉంగరం ఎత్తుకెళ్లింది. మరుసటి రోజులు నగలు కనిపించకపోవడంతో  నర్సింహారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా నిందితుల వాహనాన్ని గుర్తించి ఆంజనేయులును అదుపులోకి తీసుకుని విచారించారు. అతడిచ్చిన వివరాల ఆధారంగా వైష్ణవిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించింది. నిందితురాలిని అరెస్ట్‌ చేసి నల్లపూసలదండ, ఉంగరం స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.

జేబు దొంగ అరెస్ట్‌
నాగోలు: జేబు దొంగను అరెస్ట్‌ చేసిన ఎల్‌బీనగర్‌ పోలీసులు అతడి నుంచి సెల్‌ఫోన్, రూ. 6 వేల నగదు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. ఎల్‌బీనగర్‌ డీఐ కృష్ణమోహన్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. స్థానిక త్రిమూర్తి కాలనీకి చెందిన విజయ్‌ అలియాస్‌ జమ్ములు( ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. వ్యసనాలకు బానిసైన అతడు జేబు దొంగతనాలకు పాల్పడేవాడు. గతంలో సెల్‌ఫోన్‌ చోరీ కేసులో జైలుకు వెళ్లి వచ్చాడు. అతడిపై జీడిమెట్ల, ఎల్‌బీనగర్‌ పోలీస్‌స్టేషన్లలోనూ కేసులు ఉన్నాయి. బుధవారం రాత్రి ఎల్‌బీనగర్‌లో అనుమానాస్పదంగా కనిపించిన విజయ్‌ని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడి నుంచి సెల్‌ఫోన్, రూ.6వేల నగదు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.

 
Advertisement
 
Advertisement