రైలు నుంచి మహిళా టీటీఐ తోసివేత

Woman TTI Thrown Out From Patna Express At Kazipet Railway Station - Sakshi

కాజీపేట రూరల్‌ : పాట్నా ఎక్స్‌ప్రెస్‌లో నుంచి మహిళా ట్రావెలింగ్‌ టికెట్‌ ఇన్‌స్పెక్టర్‌ (టీటీఐ)ని ప్రయాణికులు కోచ్‌లో నుంచి బయటికి తోసేశారు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన బుధవారం వరంగల్‌ అర్బన్‌ జిల్లా కాజీపేట జంక్షన్‌లో జరిగింది. కాజీపేట జంక్షన్‌ రైల్వే కమర్షియల్‌ విభాగంలో టీటీఐగా పనిచేస్తున్న నీలిమ సికింద్రాబాద్‌ నుంచి ధానాపూర్‌ వెళ్లే పాట్నా ఎక్స్‌ప్రెస్‌లో కాజీపేటకు చేరుకుంది. స్లీపర్‌క్లాస్‌–1 బోగిలోకి వెళ్లి టికెట్‌ తనిఖీ చేస్తుండగా.. కొందరు ప్రయాణికులు జనరల్‌ టికెట్‌ తీసుకుని స్లీపర్‌క్లాస్‌ కోచ్‌లోకి రావడంతో పరిశీలించి జరిమానా చెల్లించాలని చెప్పింది. అప్పటికే కోచ్‌ రద్దీగా ఉంది.

టీటీఐ మాట వినిపించుకోకుండా వారు బయటికి తోసి వేయడంతో నీలిమ ప్లాట్‌ఫాంపై పడింది. ఆమె కాలు ప్లాట్‌ఫాం సందులోకి వెళ్లడంతో జనరల్‌ బోగి ప్రయాణికులు గమనించి బయటికి తీశారు. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది అక్కడికి చేరుకుని నీలిమను రైల్వే ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం రోహిణి ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటనతో పాట్నా ఎక్స్‌ప్రెస్‌ కొన్ని నిమిషాల పాటు కాజీపేటలో ఆగింది. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top