సఖ్యతగా మెలగడం లేదనే..

Woman Assassination Case Reveals Nalgonda Police - Sakshi

వివాహితను హత్య చేసిన యువకుడు

ఇద్దరి మధ్య ఆరేళ్లు కొనసాగిన వివాహేతర సంబంధం

ప్రియుడికి పెళ్లి కావడంతో ఎడబాటు

మళ్లీ కొనసాగించాలని ఒత్తిడి.. ఆ క్రమంలోనే ఘాతుకం

నిందితుడి అరెస్ట్, రిమాండ్‌

పెళ్లి కాని యువకుడికి పెళ్లై ఇద్దరు పిల్లలున్న మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఆరేళ్లుగా ఇద్దరు సహజీవనం చేశారు. రెండేళ్ల క్రితం ఆ యువకుడికి మరో యువతితో వివాహం కావడంతో వీరి బంధానికి తెరపడింది. అలా కొంత కాలంగా ఇద్దరూ దూరంగానే ఉన్నారు. కానీ గతంలో ఉన్న సంబంధాన్ని తిరిగి కొనసాగించాలనే ఆలోచనతో ఆ ప్రియుడు కొద్ది రోజులుగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. అయినా ఆమె తీరులో మార్పు రాలేదు. ఇదే క్రమంలో ఇద్దరి మధ్య చోటు చేసుకున్న గొడవలో ఆవేశానికి లోనై చివరకు ఆమెను మట్టుబెట్టాడు.

నల్లగొండ,చౌటుప్పల్‌ (మునుగోడు) :  చౌటుప్పల్‌ మండలం ఎల్లంబావి గ్రామంలో ఈ నెల 9వ తేదీన చోటు చేసుకున్న హత్య కేసు మిస్టరీనిఇ పోలీసులు ఛేదించారు. నిందితుడిని అరెస్ట్‌ చేసి బుధవారం  ఏసీపీ కార్యాలయంలో మీడియా ఎదుట ప్రవేశపెట్టి భువనగిరి డీసీపీ నారాయణరెడ్డి కేసు వివరాలు వెల్లడించారు.  మండలంలోని కొయ్యలగూడెం గ్రామానికి చెందిన మీసాల జయసుధ(34) టైలరింగ్‌ పని చేస్తూ జీవనం సాగిస్తుంది.  మల్కాపురం గ్రామానికి చెంది ఆర్టీసీ డ్రైవర్‌గా పని చేస్తున్న మీసాల శేఖర్‌ను 12ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకుంది. శేఖర్‌కు అప్పటికే పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ ఈమెతోనూ కాపురం చేశాడు. వీరికి చరణ్, సిద్దు ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిద్దరి నడుమ మనస్పర్థలు రావడంతో 9ఏళ్ల క్రితం విడిపోయారు. దీంతో జయసుధ సొంత ఊరైన కొయ్యలగూడెంలో ఇంటిని అద్దెకు తీసుకొని టైలరింగ్‌ పని చేసుకుంటూ జీవనం సాగిస్తోంది.

ఆరేళ్లపాటు సఖ్యతగా..
జయసుధ కొయ్యలగూడెంలో ఊదరి రామచంద్రం ఇంట్లో అద్దెకు ఉంటున్న సమయంలో పక్కింట్లో ఉండే ఊదరి రమేష్‌ పరిచయమయ్యాడు. అవివాహితుడైన అతనితో ఆరు సంవత్సరాల పాటు వివాహేతర సంబంధం కొనసాగించింది. తాపి మేస్త్రీగా పని చేసే రమేష్‌  తాను పెళ్లి చేసుకునేంత వరకు జయసుధతో వివాహేతర సంబంధాన్ని యథావిథిగా కొనసాగించాడు.

ప్రియుడికి వివాహం కావడంతో..
జయసుధతో వివాహేతర బంధం కొనసాగుతుండగానే రమేష్‌ రెండేళ్ల క్రితం చండూరు మండలం తేరట్‌పల్లి గ్రామానికి చెందిన యువతిని పెళ్లి చేసుకున్నాడు. తనతో సహజీవనం చేస్తున్న సమయంలో తాను ఎవ్వరిని పెళ్లి చేసుకోను, నీతోనే జీవిస్తానంటూ రమేష్‌ చెప్పాడు. చెప్పిన మాట ప్రకారంగా కాకుండా వేరే యువతిని పెళ్లి చేసుకోవడంతో జయసుధ ఆగ్రహించింది. అంతటితో ఆగకుండా ఇంటికి వెళ్లి అతని భార్యకు విషయం చెప్పి గొడవపడింది. అప్పటి నుంచి ఇద్దరి నడుమ వివాహేతర సంబంధం తెగిపోయింది. ఇదే సమయంలో రమేష్,  అతని భార్య నడుమ గొడవ  జరిగింది. దీంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది.

భార్య వెళ్లిపోయిందని..
అటు భార్య,  ఇటు ప్రియురాలు రమేష్‌కు దూరమయ్యారు. ఈ క్రమంలో జయసుధతో తిరిగి సఖ్యతగా మెలిగగేందుకు రమేష్‌ ప్రయత్నాలు ప్రారంభించాడు. ఇటీవల జయసుధ కొయ్యలగూడెం నుంచి పక్కనే ఉన్న ఎల్లంబావి గ్రామానికి ఇంటిని మార్చింది. అందులో భాగంగా రమేష్‌  ఈ నెల 05, 06, 07 తేదీల్లో   జయసుధ ఇంటికి వెళ్లాడు. మాట్లాడే క్రమంలో ఇద్దరు గొడవ పెట్టుకున్నారు.  అదే క్రమంలో 9న సైతం అదే మాదిరిగా ఇంట్లోకి వెళ్లాడు. పాత విషయాలు మాట్లాడుకునే సమయంలో ఇద్దరి నడుమ ఘర్షణ జరిగింది. ఆ క్రమంలోనే పక్కనే ఉన్న ఫైజామాతో మెడకు బిగించి జయసుధను హత్య చేశాడు.

నిందితుడు ఎలా చిక్కాడంటే...
జయసుధ ఎల్లంబావిలోని మాచర్ల సుధాకర్‌ ఇంట్లో అద్దెకు ఉంటుంది. సుధాకర్‌ తన ఇంటి వెనుకనే మరో ఇంటిని నిర్మించుకుంటున్నాడు. తాపి మేస్త్రీగా ఊదరి రమేష్‌ ఇక్కడ పని చేస్తున్నాడు. అందులో భాగంగా ఈ నెల 9న మరో ఐదుగురితో కలిసి ఇంటి పనులు చేస్తున్నాడు. మధ్యాహ్నం 1గంటలకు భోజన సమయంలో మద్యం సేవించి జయసుధ ఇంటికి వెళ్లాడు. ఘర్షణ చోటు చేసుకోవడంతో అక్కడే చిరిగిపడి ఉన్న ఫైజామాతో మెడకు బిగించి హత్య చేశాడు. ఉరి వేసుకున్నట్లుగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో ఇంటి యజమాని అక్కడికి రావడంతో జారుకుని మేస్త్రీ  పనిలో నిమగ్నమయ్యాడు. 

కొద్ది సేపటి తర్వాత జయసుధ కుమారుడు చరణ్‌ ఇంట్లోకి వెళ్లి చూడగా విషయం వెలుగులోకి వచ్చింది. అప్పటికే రమేష్‌ ఇంట్లోకి వెళ్లిపోవడం, మధ్యాహ్నం ఇంటి నిర్మాణ పనుల్లో కొంత సేపు లేకపోవడం, సాయంత్రం 4 తర్వాత పని నుంచి పరారవ్వడంతో పోలీసులకు  అనుమానం కలిగింది. ఆ ప్రకారంగా విచారణ చేపట్టారు. అందులో భాగంగా బుధవారం మండల కేంద్రంలోని బస్‌స్టేషన్‌లో తిరుగుతుండగా  అదుపులోకి తీసుకున్నారు. నేరం అంగీకరించాడు. అరెస్టు చేసి రిమాండ్‌ నిమిత్తం రామన్నపేట కోర్టుకు తరలించారు. సమావేశంలో ఏసీపీ సత్తయ్య, సీఐ పులిజాల వెంకటేశ్వర్లు, ఎస్సై నాగేశ్వర్‌రావు, ఉన్నారు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top