
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ నివాసం ఎదుట ఆదివారం తీవ్ర కలకలం రేగింది. సీఎం నివాసం ఎదుట ఓ మహిళ, ఆమె కుటుంబసభ్యులు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించారు. ఒక బీజేపీ ఎమ్మెల్యే, అతని సహచరులు తనపై అత్యాచారం జరిపారని, వారిపై చర్య తీసుకోవాల్సిందిగా ఎవరికి మొరపెట్టినా తనకు న్యాయం జరగడం లేదని ఆరోపిస్తూ మహిళ ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టింది. పోలీసులు సకాలంలో ఆమె ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. సీఎం నివాసం ఎదుట పడుకొని ఆమె, ఆమె కుటుంబసభ్యులు నిరసన తెలిపారు.
‘నన్ను రేప్ చేశారు. ఏడాదిగా నాకు జరిగిన అన్యాయంపై చెప్పేందుకు ప్రతి ఒక్కరినీ కలుస్తున్నాను. కానీ ఎవరు నా మాట వినిపించుకోవడం లేదు. నాపై అఘాయిత్యం చేసినవారందరినీ అరెస్టు చేయాలి. లేదంటే నన్ను నేను చంపుకుంటాను. ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నా ఫలితం లేకుండాపోయింది. మేం ఎఫ్‌ఐఆర్ నమోదుచేస్తే.. మమ్మల్ని బెదిరించారు’ అని బాధితురాలు తెలిపారు.