భార్యే చంపించింది..

Wife Killed husband In East Godavari - Sakshi

ప్రియుడితో కలసి భర్త హత్యకు పథక రచన

లైన్‌ ఇన్‌స్పెక్టర్‌ హత్య కేసును చేధించిన పోలీసులు

తూర్పుగోదావరి, రంపచోడవరం: విలీన మండలం నెల్లిపాకలో విద్యుత్‌శాఖలో లైన్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న గొర్లె చెల్లారావు హత్య కేసును పోలీసులు చేధించారు. భార్య గొర్లె హేమలత ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిందని తేల్చారు. నిందితులు హతుడి భార్య గొర్లె హేమలత, రెడ్డి శివప్రసాద్‌లను పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో పోలీసులు హత్యకేసు వివరాలు వెల్లడించారు. భర్త చెల్లారావుతో విడిపోయిన హేమలత స్థానిక ఎర్రంరెడ్డి నగర్‌లో నివాసం ఉంటోంది. విశాఖపట్నం జిల్లా నాతవరానికి చెందిన ప్రైవేట్‌ వైద్యుడు రెడ్డి శివప్రసాద్‌ రంపచోడవరంలో ఆంధ్రాబ్యాంకు ఎదురుగా ప్రైవేట్‌ క్లినిక్‌ నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో పలుమార్లు క్లినిక్‌కు వెళ్లడంతో ఆమెతో పరిచయం ఏర్పడి, అక్రమ సంబంధానికి దారి తీసింది. భర్తను హత్య చేసి అడ్డు తొలగించుకునేందుకు ఇద్దరు కలిసి పథక రచన చేశారు. గత నెల 30న తెల్లవారు జామున భార్య ఇంటికి వచ్చిన చెల్లారావు భార్య ప్రియుడు అక్కడే ఉండడంతో గొడవకు దిగాడు. దీంతో ప్రియుడితో భార్య హేమలత కలిసి చెల్లారావు తలపై తీవ్రంగా కొట్టి హత్య చేసినట్టు సీఐ బీహెచ్‌ వెంకటేశ్వర్లు తెలిపారు. అక్కడ సమీపంలోని డ్రైనేజీలో శవాన్ని పడవేశారు. సంఘటన జరిగిన తరువాత ఏఎస్పీ రాహుల్‌దేవ్‌ సింగ్‌ ఆధ్వర్యంలో సీఐ, ఎస్సై జె విజయబాబు పర్యవేక్షణలో దర్యాప్తు చేసి కేసును చేధించారు.

చదివింది డీఫార్మసీ.. బోర్డు మాత్రం ఎంబీబీఎస్, ఎండీ(న్యూరోసర్జన్‌)
నిందితుడు శివప్రసాద్‌ డీఫార్మసీ చదివినట్టు సీఐ బీహెచ్‌ వెంకటేశ్వర్లు తెలిపారు. కొన్నేళ్లుగా రంపచోడవరంలో ప్రైవేట్‌ క్లినిక్‌ నిర్వహిస్తున్నాడని, అతను నిర్వహించే క్లినిక్‌ వద్ద ఎంబీబీఎస్, ఎండీ (న్యూరోసర్జన్‌) బోర్డు పెట్టుకున్నాడని పేర్కొన్నారు. ఎటువంటి అర్హతలు లేకుండా ఎంబీబీఎస్‌ అంటూ బోర్డు పెట్టుకుని వైద్య సేవలు చేసిన దానిపై ఏజెన్సీ వైద్య ఆరోగ్యశాఖ అధికారికి వివరాలు అందజేస్తామన్నారు. వారి నివేదిక ఆధారంగా మరో కేసు నమోదు చేస్తామన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top