అత్యాశే కొంపముంచింది

Wanaparthy Mines Department AD Caught While Taking Bribe In ACB Raids - Sakshi

ఏసీబీకి చిక్కిన మైన్స్‌శాఖ ఏడీ జాకబ్‌

క్వారీ పేరు మార్చేందుకు లంచం డిమాండ్‌

మొదట లంచం ముట్టజెప్పినా.. సరిపోదంటూ ఒత్తిడి

ఏసీబీని ఆశ్రయించిన బాధితుడు

సాక్షి, వనపర్తి: అత్యాశ పతనానికి దారితీస్తుందన్న విషయం మరోసారి నిరూపితమైంది. రూ.వేలల్లో జీతాలు తీసుకునే ప్రభుత్వ అధికారులు అక్రమార్జనకు అలవాటుపడిన కొందరు అధికారులు పేద, ధనిక అనే తేడా లేకుండా లంచం కోసం వేధించటం ఈ రోజుల్లో పరిపాటిగా మారింది. ఓ చిన్న పనికోసం ఇదివరకే రూ.ఒక లక్ష లంచం తీసుకున్న వనపర్తి మైన్స్‌శాఖ ఏడీ జాకబ్‌ మరో రూ.20 వేల కోసం అత్యాశపడి చివరికి ఏసీబీ వలకు శుక్రవారం చిక్కిన సంఘటన వనపర్తిలో సంచలనం రేకెత్తిస్తోంది. ఏసీబీ డీఎస్పీలు ఫయాజ్, శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన దిలీపాచారికి వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలం బుద్దారంలో మినరల్స్‌ క్వారీ ఉంది. దానిని మరో కంపెనీకి విక్రయించిన దిలీపాచారి  మైన్స్‌క్వారీని శ్రీ సాయి మినరల్స్‌ అండ్‌ మైన్స్‌ నుంచి మరో సంస్థ పేరున మార్చాలని కోరుతూ దరఖాస్తు చేశాడు. 

తనిఖీ.. ఐదురెట్లు అదనంగా ఫైన్‌
ఇదిలాఉండగా, క్వారీని తనిఖీ చేసిన మైన్స్‌ ఏడీ జాకబ్‌ చెల్లించాల్సిన రాయల్టీకి ఐదురెట్లు అదనంగా ఫైన్‌ వేస్తూ షోకాజ్‌ నోటీసు ఇచ్చారు. ఫై న్‌ వేసేందుకు కారణమేంటి నేను ప్రభుత్వ నిబంధనల మేరకే క్వారీ నిర్వహణ చేస్తున్నానని బాధితుడు అధికారిని అభ్యర్థించగా రూ.ఒక లక్ష లంచం ఇవ్వమని ఏడీ కోరాడు. దీంతో  సె ప్టెంబర్‌ 27వ తేదీన స్థానికంగా ఉన్న మైన్స్‌ ఏడీ జాకబ్‌ దిలీపాచారిని తన ఇంటికి పిలిపించుకుని రూ.ఒక లక్ష లంచం తీసుకున్నాడు. అయినా కూడా పనిచేయకుండా ఇబ్బందులకు గురిచేస్తూ వచ్చాడు. శుక్రవారం ఆర్‌ఐకి ఇవ్వాలంటూ మరో రూ.20వేలు తీసుకురమ్మని ఏడీ కోరాడు. దీంతో బాధితుడు దిలీపాచారి తమను ఆశ్రయించాడని ఏసీబీ అధికారులు తెలిపారు. 

పథకం ప్రకారం పట్టుకున్నారు..
ఇదివరకే రూ.ఒక లక్ష లంచం తీసుకుని పనిచేయకుండా రోజూ ప్రదక్షణలు చేయిస్తూ ఇంకా లంచం కావాలని వేధించటంతో బాధితుడు దిలాపాచారి ఏబీసీ అధికారులను ఆశ్రయించారు. వారు పౌడర్‌ చల్లిన నోట్లను బాధితుడికి ఇచ్చారు. మైన్స్‌ఏడీ జాకబ్‌ ఆ నోట్లని తెలియక లంచంగా తీసుకుని రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. బాధితుడితో లంచం తీసుకున్న వెంటనే వనపర్తిలోని కార్యాలయం సమీపంలో కాచుకుని ఉన్న సుమారు 20 మంది ఏసీబీ అధికారులు సిబ్బంది ఒక్కసారిగా.. దాడి చేసి జాకబ్‌ను పట్టుకున్నారు. జాకబ్‌తో పాటు లంచంలో భాగస్వామ్యం ఉన్న సాయిరాంను అదుపులోకి తీసుకుని వారి వద్ద ఉన్న సెల్‌ఫోన్లను లాక్కున్నారు.

ఇల్లు, కార్యాలయంలో సోదాలు
మైన్స్‌ ఏడీ లంచావతారంపై ఫిర్యాదు రాగానే ఏసీబీ అధికారులు ఆఫీస్‌తో పాటు అతని ఇంట్లోను సోదాలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇక్కడ లంచం తీసుకుంటూ పట్టుబడగానే హైదరాబాద్‌లోని తన నివాసంలోనూ సోదాలు ప్రా రంభించినట్లు ఏబీసీ అధికారులు తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top