గ్రామాల్లో హైఅలర్ట్‌ | Villagers Fear About Parthi Gang in PSR Nellore District | Sakshi
Sakshi News home page

గ్రామాల్లో హైఅలర్ట్‌

May 1 2018 11:09 AM | Updated on Jul 30 2018 9:21 PM

Villagers Fear About Parthi Gang in PSR Nellore District - Sakshi

బంగారుపేటలో అపరచితులు ప్రవేశించారన్న నేపథ్యంలో కర్రలు టార్చ్‌లైట్లతో కాలనీలో గస్తీ తిరుగుతున్న కాలనీ వాసులు

వెంకటగిరిరూరల్‌: అత్యంత కిరాతకంగా హత్యలు చేసి దోపిడీలకు పాల్పడే పార్థీగ్యాంగ్‌ ముఠా జిల్లాలో సంచరిస్తుందనే పోలీస్‌ హెచ్చరికల నేపథ్యంలో గ్రామాల్లో జనం హైఅలర్ట్‌ అయ్యారు. గ్రామీణ ప్రజలు రాత్రి అయితే చాలు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు. అనుమానితులు, అపరిచిత వ్యక్తులు గ్రామాల్లో సంచరిస్తున్నట్లు గుర్తిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలంటూ పోలీసులు ఓ పక్క ప్రచారం చేస్తుండటంతో జనం మరింత భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి వేళలో ప్రజలు ఇంటి నుంచి వెళ్లాలంటే వణికిపోతున్నారు. ఈ క్రమంలో గత కొద్ది రోజుల క్రితం మండలంలోని పెట్లూరు, పంజాం, గొడ్లగుంటగుంట గ్రామాల్లో ఐదుగురు గుర్తుతెలియని వ్యక్తులు సంచరించడంతో ప్రజలు భయాందోళనతో పోలీసులకు సమాచారం అందించారు. వారం రోజుల క్రితం మండలంలోని కలపాడులోని శివారు ప్రాంతంలోని నివాసంలో పగలు గుర్తు తెలియని వ్యక్తులు బంగారు, నగదు దోచుకెళ్లారు. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు అందినట్లు సమాచారం.

ఈ  ఘటనల నేపథ్యంలో పార్థీగ్యాంగ్‌ చేసిన అఘాయిత్యాలు వాట్సాప్, సోషల్‌ మీడియాల్లో ప్రచారం జరుగుతుండటంతో పారవోలు, సిద్ధవరం, బాలసముద్రం, పారవోలు కండ్రిగ, దాచెరువు, పాళెంకోట, మొక్కలపాడు, చెలికంపాడు, కుర్జాగుంట, మన్నేగుంట చిన్నపరెడ్డిపల్లి, కళవలపూడి, కుమ్మరిపేట, జీకేపల్లి, యాతలూరు, వల్లివేడు తది తర గ్రామాల్లో ప్రజలను పార్ధీగ్యాంగ్‌ భయం వెంటాడుతుంది. దీంతో గ్రామస్తులు బృందాలుగా ఏర్పడి రాత్రి సమయాల్లో ముమ్మరంగా గస్తీ నిర్వహిస్తున్నారు. ఆదివారం రాత్రి పట్టణంలోని బంగారుపేట సమీపంలోని తెలుగుగంగ కాలువ వంతెన, కట్టలపై గుర్తు తెలియని వ్యక్తులు టార్చ్‌లైట్లతో సం చారించారని, అర్ధరాత్రి నివాసాల్లోకి ప్రవేశించారన్న నేపథ్యంలో బంగారుపేట వాసులు సోమవారం తెల్లవారుజామున వరకు కర్రలు, టార్చ్‌లైట్లు గ్రామంలోనే సంచరించారు. శివారు గ్రామాలు అమ్మపాళెం, కుప్పంపల్లి, పాపమాంబపురం, జంగాలపల్లి, ముదంపల్లి, పట్రపల్లి తదితర గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. పోలీసులు స్పందించి మండలంలోని శివారు గ్రామాల్లో పోలీసు గస్తీ ఏర్పాటు చేయాలని పలువురు గ్రామీణ ప్రజలు కోరుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement