breaking news
parthu gang
-
గ్రామాల్లో హైఅలర్ట్
వెంకటగిరిరూరల్: అత్యంత కిరాతకంగా హత్యలు చేసి దోపిడీలకు పాల్పడే పార్థీగ్యాంగ్ ముఠా జిల్లాలో సంచరిస్తుందనే పోలీస్ హెచ్చరికల నేపథ్యంలో గ్రామాల్లో జనం హైఅలర్ట్ అయ్యారు. గ్రామీణ ప్రజలు రాత్రి అయితే చాలు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు. అనుమానితులు, అపరిచిత వ్యక్తులు గ్రామాల్లో సంచరిస్తున్నట్లు గుర్తిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలంటూ పోలీసులు ఓ పక్క ప్రచారం చేస్తుండటంతో జనం మరింత భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి వేళలో ప్రజలు ఇంటి నుంచి వెళ్లాలంటే వణికిపోతున్నారు. ఈ క్రమంలో గత కొద్ది రోజుల క్రితం మండలంలోని పెట్లూరు, పంజాం, గొడ్లగుంటగుంట గ్రామాల్లో ఐదుగురు గుర్తుతెలియని వ్యక్తులు సంచరించడంతో ప్రజలు భయాందోళనతో పోలీసులకు సమాచారం అందించారు. వారం రోజుల క్రితం మండలంలోని కలపాడులోని శివారు ప్రాంతంలోని నివాసంలో పగలు గుర్తు తెలియని వ్యక్తులు బంగారు, నగదు దోచుకెళ్లారు. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు అందినట్లు సమాచారం. ఈ ఘటనల నేపథ్యంలో పార్థీగ్యాంగ్ చేసిన అఘాయిత్యాలు వాట్సాప్, సోషల్ మీడియాల్లో ప్రచారం జరుగుతుండటంతో పారవోలు, సిద్ధవరం, బాలసముద్రం, పారవోలు కండ్రిగ, దాచెరువు, పాళెంకోట, మొక్కలపాడు, చెలికంపాడు, కుర్జాగుంట, మన్నేగుంట చిన్నపరెడ్డిపల్లి, కళవలపూడి, కుమ్మరిపేట, జీకేపల్లి, యాతలూరు, వల్లివేడు తది తర గ్రామాల్లో ప్రజలను పార్ధీగ్యాంగ్ భయం వెంటాడుతుంది. దీంతో గ్రామస్తులు బృందాలుగా ఏర్పడి రాత్రి సమయాల్లో ముమ్మరంగా గస్తీ నిర్వహిస్తున్నారు. ఆదివారం రాత్రి పట్టణంలోని బంగారుపేట సమీపంలోని తెలుగుగంగ కాలువ వంతెన, కట్టలపై గుర్తు తెలియని వ్యక్తులు టార్చ్‌లైట్లతో సం చారించారని, అర్ధరాత్రి నివాసాల్లోకి ప్రవేశించారన్న నేపథ్యంలో బంగారుపేట వాసులు సోమవారం తెల్లవారుజామున వరకు కర్రలు, టార్చ్లైట్లు గ్రామంలోనే సంచరించారు. శివారు గ్రామాలు అమ్మపాళెం, కుప్పంపల్లి, పాపమాంబపురం, జంగాలపల్లి, ముదంపల్లి, పట్రపల్లి తదితర గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. పోలీసులు స్పందించి మండలంలోని శివారు గ్రామాల్లో పోలీసు గస్తీ ఏర్పాటు చేయాలని పలువురు గ్రామీణ ప్రజలు కోరుకుంటున్నారు. -
ప్రాణాలు తీస్తున్న పార్థీ గ్యాంగ్ పుకార్లు
చిత్తూరు అర్బన్: ఈ రెండే కాదు.. పార్థీ గ్యాంగ్ పేరు ప్రచారంలోకి వచ్చాక జిల్లాలోని సగానికి పైగా మండలాల్లో రాత్రులు జనం నిద్రపోవడంలేదు. ఎప్పుడు ఎవరు వస్తారో తెలియక చేతిలో కర్రలు, బలమైన ఆయుధాలు పట్టుకుని రాత్రులు గస్తీ తిరుగుతున్నారు. తమ ప్రాణాలు కాపాడుకోవాలనే ఆతృతలో అమాయకులపై, అనుమానంగా కనిపించే వారిపై దాడులు చేస్తున్నారు. ఇవి ఒక్కోసారి శ్రుతి మించడంలో అభం శుభం తెలియని వ్యక్తులు ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. హిందీ మాట్లాడితే అంతే... ఇటీవల రామచంద్రాపురం, పాకాల, ఎర్రావారిపాలెం మండలాల్లోని 12 గ్రామాల్లో పార్థీగ్యాంగ్ తిరుగుతోందనే పుకార్లతో ప్రజలంతా అప్రమత్తమయ్యారు. వంతులు వేసుకుని మరీ గత 15 రోజులుగా రాత్రుళ్లు జాగారం చేస్తున్నారు. వారం క్రితం పార్థీగ్యాంగ్ సభ్యుడనే అనుమానంతో రామచంద్రాపురంలో ఓ వ్యక్తిని చితకబాది పోలీసులకు అప్పగించారు. చిత్తూరు నగరంలోనూ ఇదే తంతు. పలు కాలనీల్లో యువకులు నిద్ర మానేసి పార్థీగ్యాంగ్ను పట్టుకుంటామని రాత్రులు పహారా కాస్తున్నారు. పొద్దుపోయిన తరువాత ఎవరైనా అనుమానిత వ్యక్తులు కాలనీలు, గ్రామాల్లోకి వచ్చి పొరపాటున హిందీ మాట్లాడితే చావుదెబ్బలు తినాల్సిన పరిస్థితి నెలకొంది. దోపిడీలు, హత్యలకు పాల్పడే పార్థీగ్యాంగ్ ముఠా ఆనవాళ్లు ప్రస్తుతం జిల్లాలో లేవని పోలీసులు చెబుతున్నా కొన్నిచోట్ల ప్రజల ఆలోచనల్లో మార్పు రావడంలేదు. ఆలోచన అవసరం ఎక్కడైనా అనుమానితులు కనిపిస్తే వాళ్లను పట్టుకుని కొట్టడం మానేయాలి. తొలుత అతను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడని విచారించాలి. అతని వద్ద ఆయుధాలుంటే జాగ్రత్తగా వ్యవహరించాలి. ఒకరు విచారిస్తుండానే మరొకరు పోలీసులకు సమాచారం అందించాలి. అలాకాకుండా ఆవేశంలో విజ్ఞత మరచిపోయి కనిపించిన అనుమానితులపై దాడులు చేయడం, కొట్టి చంపడం మానవతా విలువల్ని చంపేయడమే అవుతుంది. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో అనుమానిత వ్యక్తిని ఏదైనా ఆధార్ కేంద్రానికి తీసుకెళ్లి అతని చేతివేలి ముద్రలు స్కాన్ చేస్తే చిరునామా వచ్చే అవకాశం ఉంది. పోలీసులకు అప్పగిస్తే వాళ్ల వద్ద ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో అనుమానిత వ్యక్తి ఎవరనేది గుర్తిస్తారు. దొంగైతే చట్టరీత్యా చర్యలు తీసుకుంటారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే హక్కు ఎవరికీ లేదు. చిత్తూరులో జరిగిన హత్యలో అనుమానిత వ్యక్తిని విచారించిన పోలీసులు అతనికి మతిస్థిమితంలేదని గుర్తించి ఏదైనా హోమ్‌లో చేర్పించి ఉంటే ప్రాణాలు పోయేవికావు. ప్రజల ఆవేశంతో పాటు పోలీసుల నిర్లక్ష్యం కూడా కనిపిస్తోంది. మహిళను చితకబాదిక గ్రామస్తులు పూతలపట్టు: మండలంలోని పి.కొత్తకోట ప్రాంతంలో సంచరిస్తున్న మహిళను స్థానికులు పార్థీ గ్యాంగ్ సభ్యురాలని భావించి చితక బాదారు. ఆమెకు మాటలు రాకపోవడం, గ్రామస్తులకు సమాధానం చెప్పకపోవడంతో పార్థీగ్యాంగ్ అని అనుమానించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆమెను పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. అనంతరం ఎస్ఐ మురళీమోహన్ ఫోన్ ద్వారా అమ్మ ఒడి ఆశ్రమ నిర్వాహుడు పద్మనాభ నాయుడికి సమాచారం అందించారు. వారు పూతలపట్టు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి మాటలు రాని మహిళను ఆశ్రమానికి తీసుకెళ్లారు. తన పేరు రష్మి అని ఆమె హిందీలో రాసి చూపించింది. పార్థీ గ్యాంగ్‌నకు సంబంధించిన వారని ఎవరినీ అనవసరంగా కొట్టరాదని, అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్ఐ కోరారు. పార్థీగ్యాంగ్ లేదు జిల్లాలో ఎక్కడా పార్థీగ్యాంగ్ ఆనవాళ్లు లేవు. ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరంలేదు. అనుమానితులు కనిపిస్తే వెంటనే 100కు సమాచారం ఇవ్వండి. ఎవరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు. గస్తీలు కాయడం, పహారా ఉండడం తప్పుకాదు. కానీ ప్రాణాలు పోయే వరకు కొట్టడం అంటే హత్య చేయడమే. ఇలా చేయడం నేరం.– రాజశేఖర్‌బాబు, ఎస్పీ, చిత్తూరు -
36 చోరీ కేసుల్లో నిందితులు అరెస్టు
పట్టుపడిన తెల్లపాముల, పార్థు గ్యాంగ్ సభ్యులు 1.6 కిలోల బంగారు నగలు, 8.25 కిలోల వెండి వస్తువులు స్వాధీనం విజయవాడ : నగరంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన 36 చోరీ కేసుల్లో నిందితులైన ఆరుగురిని విజయవాడ సీసీఎస్ ఇంటిలిజెన్స్ పోలీసులు అరెస్టు చేశారు. దేశంలో ప్రముఖ గ్యాంగులకు చెందిన వీరి నుంచి రూ.50 లక్షల విలువైన 1.6 కిలోల బంగారు నగలు, 5.25 కిలోల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులకు సంబంధించిన వివరాలను పోలీస్ కమిషనరేట్‌లో క్రైం డీసీపీ పాల్‌రాజ్ గురువారం విలేకరులకు వెల్లడించారు. ఆయన కథనం మేరకు.. తెల్లపాముల గ్యాంగ్‌గా పేరుపొంది న పశ్చిగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన దాసరి పేతురు, మింగి ఎర్రబాబు, దాసరి రంగరావు, దాసరి ఏసురత్నం బంధువులు. వారిపై కాకినాడ, తాడేపల్లిగూడెం, ఏలూరులో పలుదొంగతనాల కేసులు ఉన్నాయి. వీరిలో ఎర్రబాబుపై హత్యకేసు కూడా ఉంది. వారందరు కలిసి విజయవాడ, ఏలూరులో పగటిపూట చిత్తుకాగితాలు ఏరుకునే వారిగా నటిస్తూ కొన్ని ఇళ్లను గుర్తించి రాత్రిపూట చోరీలకు పాల్పడుతుంటా రు. విజయవాడలో మొత్తం 23 చోరీలు చేశారు. 2009లో ఉంగుటూరులో ఒకటి, 2013లో విజయవాడ పటమటలో రెండు, 2014లో ఊయ్యూర ఒక చోరీచేశారు. 2015లో మాచవరం ఏరి యాలో రెండు, గన్నవరం ఏరియాలో రెండు, పెనమలూరు, ఉయ్యూరు, కంకిపాడులో మూడు చొప్పున చోరీలు చేశారు. 2016లో ఏలూరు, ఉయ్యూరు, కంకిపాడు, పెనమలూరులో రెండేసి, ఉంగుటూరు, గన్నవరం, మాచవరం, తోట్లవల్లూరులో ఒక్కొక్కటి చొప్పున చోరీలు చేశారు. నిందితులు ఒన్‌టౌన్ కాలేశ్వరరావు మార్కెట్ సమీపంలో చోరీ చేసిన బంగారు నగలను విక్రయించేం దుకు ప్రయత్నిస్తుండగా సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. వారినుంచి 23 చోరీలకు సంబంధించి రూ.25 లక్షల విలువైన 810 గ్రామలు బంగారు ఆభరణాలు, నాలుగు కిలోల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన పార్థు గ్యాంగ్ మధ్యప్రదేశ్‌లో పార్థు గ్యాంగ్‌గా పేరు పొందిన ఇద్దరు పాత నేరస్తులను కూడా సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రేమ్ సింగ్ అలియాస్ బాబు సింగ్ మోగియా అలియాస్ బాబూ ప్రేమ్, బీర్సింగ్ విజయవాడ రాజీవ్ గాంధీ పార్కు సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా సీసీఎస్ పోలీసులు పట్టుకుని విచారించారు. నిందితులు ఇద్దరు రేండేళ్లుగా విజయవాడ వచ్చి వెళ్తూ పగలు రెక్కీ నిర్వహించి రాత్రిపూట చోరీలకు పాల్పడుతున్నారు. 2014లో వెటర్నరీ కాలనీ, పటమట లక్షీపతికాలనీ, మాచవరం ఓల్డ్ ఎస్బీఐ కాలనీలో చోరీలకు పాల్పడి, దొరికిన సొమ్ముతో మధ్యప్రదేశ్ వెళ్లిపోయారు. 2015, 2016లో విజయవాడ వచ్చి కంకిపాడు, గుడివాడ, పటమట కోనేరువారి వీధిలో, మాచవరం ఏరియా కార్మికనగర్, పెనమలూరు సమీపంలో యనమలకుదురులో మొత్తం 13 దొంగతనాలకు పాల్పడ్డారు. వారు మరో సారి చోరీ చేసేందుకు విజయవాడ రాగా పోలీసులు అనుమానించి పట్టుకున్నారు. వారి వద్ద రూ.25 లక్షలు విలువైన 800 గ్రామలు బంగారు ఆభరణాలు, 4.25 కిలోల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. విలేకరుల సమాశంలో విజయవాడ క్రై ఏడీసీపీ రామకోటేశ్వరరావు, ఏసీపీలు వర్మ, పోతురాజు తదితరులు పాల్గొన్నారు.