క్రూరంగా చంపి.. ఎట్టకేలకు చిక్కాడు | US police crack 32 year old Rape and murder mystery | Sakshi
Sakshi News home page

Jun 24 2018 9:56 AM | Updated on Jul 28 2018 8:53 PM

US police crack 32 year old Rape and murder mystery - Sakshi

సుమారు 30 ఏళ్ల క్రితం. 12 ఏళ్ల చిన్నారిని అతిక్రూరంగా హత్యాచారం చేసిన ఘటన టకోమా సిటీని కుదిపేసింది. అయితే  చిన్న క్లూ కూడా లభించకపోవటంతో ఆ కేసు అటకెక్కిందని అంతా భావించారు. కానీ, పోలీసులు మాత్రం పట్టువిడవలేదు. అండర్‌ కవర్‌ ఏజెంట్ల సాయంతో మూడు దశాబ్దాలుగా దర్యాప్తు జరిపించి ఎట్టకేలకు నిందితుడిని అరెస్ట్‌ చేశారు. 

వాషింగ్టన్‌: 1986, మార్చి 26న మిచెల్లా వెల్చ్‌ అనే అమ్మాయి తన ఇద్దరు చెల్లెల్లతో కలిసి స్థానికంగా ఉన్న ఓ పార్క్‌లో ఆడుకోటానికి వెళ్లింది. అయితే లంచ్‌ తీసుకొచ్చేందుకు వెళ్లిన బాలిక.. తిరిగి రాలేదు. కాసేపటికి ఆమె సైకిల్‌, లంచ్‌ బాక్స్‌ కాస్త దూరంలో కనిపించాయి. దీంతో కంగారుపడ్డ ఆ ఇద్దరు పిల్లలు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అటుపై వారు పోలీసులను ఆశ్రయించగా, డాగ్‌ స్క్వాడ్‌ పార్క్‌కు అరకిలోమీటర్‌ దూరంలో బాలిక మృతదేహాన్ని గుర్తించింది. పోస్టుమార్టంలో మిచెల్లా దారుణంగా హత్యాచారానికి గురైనట్లు తేలింది. దీంతో నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. 

అండర్‌ కవర్‌ ఏజెంట్లతో... దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేకపోవటంతో బాధిత కుటుంబం ఆశలు వదిలేసుకుంది. అయితే పోలీసులు మాత్రం అస్సలు వెనక్కి తగ్గలేదు. అండర్‌ కవర్‌ ఏజెంట్ల సాయంతో సుమారు మూడు దశాబ్దాలకు పైగా ఈ కేసు దర్యాప్తు కొనసాగిస్తూ వచ్చారు. నిందితుడి డీఎన్‌ఏ ప్రొఫైల్‌ నేరస్థుల జాబితాలోని వారితో మ్యాచ్‌ కాకపోవటంతో  తలలు పట్టుకున్నారు. దీంతో కేసును కొన్నాళ్లు హోల్డ్‌లో పెట్టారు. చివరికి 2016లో జన్యుశాస్త్రవేత్త సాయంతో నిందితుల వేటను తిరిగి ప్రారంభించారు. ఇందుకోసం జెనాలజీని ఆశ్రయించారు. జెనాలజీ అంటే వంశవృక్షాన్ని తయారుచేసేందుకు ఉపయోస్తారు.(ఆ డేటా ఇంటర్నెట్‌లో దొరుకుతుంది కూడా). దీని ద్వారా ఇద్దరు సోదరులను పోలీసులు అనుమానించారు. వారిలో ఒకడైన గ్యారీ హర్ట్‌మన్‌(66) తాజాగా ఓ రెస్టారెంట్‌కు వెళ్లి నాప్‌కిన్‌ను వాడాడు. అక్కడే ఉన్న సీక్రెట్‌ ఏజెంట్‌ దానిని సేకరించి, పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపాడు. అదికాస్త కేసులోని నిందితుడి డీఎన్‌ఏకు సరితూగటంతో.. గ్యారీని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.

చివరకు మిచెల్లాను అత్యాచారం చేసి, హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించటంతో కోర్టులో ప్రవేశపెట్టారు. హర్టమన్‌కు కఠిన శిక్ష పడే అవకాశం ఉందని బాధితుల తరపు న్యాయవాది చెబుతున్నారు. మొత్తానికి అత్యాధునిక టెక్నాలజీ ద్వారా పోలీసులు ఈ కేసును ఛేధించగలిగారు. అన్నట్లు జెనటిక్‌ జెనాలజీ ద్వారానే 70, 80 దశకంలో 50 అత్యాచారాలు, పదుల సంఖ్యలో హత్యలు, దోపిడీలు చేసిన ‘గోల్డెన్‌ స్టేట్‌ కిల్లర్‌’ను ఈ ఏడాది ఏప్రిల్‌లో కాలిఫోర్నియా పోలీసులు అరెస్ట్‌ చేయటం విశేషం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement