ఎంతపనాయే కొడుకా..! | Unemployed Road Accident Died In America | Sakshi
Sakshi News home page

ఎంతపనాయే కొడుకా..!

Apr 24 2019 8:10 AM | Updated on Apr 24 2019 8:10 AM

Unemployed Road Accident Died In America - Sakshi

రోదిస్తున్న మృతుడి తల్లి, బంధువులు, రెడ్డి శ్రావణ్‌ (ఫైల్‌)

బెల్లంపల్లి: కుమారుడికి మంచి విద్య అందించాలనే ఉద్దేశంతో అమెరికా పంపించారు. వారి ఆశలను వమ్ము చేయకుండా ఆ కుమారుడు సైతం బాగానే చదువుకుంటున్నాడు. సుమారు నాలుగేళ్లుగా అక్కడే విద్యాబోధన చేస్తున్నాడు. త్వరలో మంచి ఉద్యోగం సాధిస్తాడని, ఇక తమ కష్టాలు తీరుతాయని తల్లిదండ్రులు ఆనందపడుతున్నారు. కానీ.. వారి ఆనందం అంతలోనే ఆవిరి అయ్యింది. ఉన్నత చదువుల కోసం అందనంత దూరం వెళ్లి.. అక్కడి నుంచే అటే ఈ లోకాన్నే విడిచాడన్న వార్త వారిని శోక‘సంద్రం’లో ముంచింది. సెలవు రోజు కావడంతో స్నేహితులతో కలిసి సరదాగా బీచ్‌కు వెళ్లిన ఆ యువకుడు అక్కడే ఈత కొట్టేందుకు సముద్రంలోకి దిగి తిరిగిరాని లోకాలకు వెళ్లాడు.

అమెరికాలో జరిగిన ఈ సంఘటన బెల్లంపల్లిలోని అతడి కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. అయ్యో కొడుకా.. ఎంత పనాయే అంటూ రోదిస్తున్న ఆ తల్లిదండ్రులను ఆపడం ఎవరితరమూ కావడం లేదు. స్థానికులు, బంధువుల కథనం ప్రకారం.. బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధి అశోక్‌నగర్‌బస్తీకి చెందిన రెడ్డి రాజం, మాలతి దంపతుల చిన్న కుమారుడు శ్రావణ్‌ (27) అమెరికాలోని టెక్సాస్‌ ప్రాంతం రిచ్‌మండ్‌లో ఉంటూ ఉన్నత విద్యను అభ్యసిస్తున్నాడు. హైదరాబాద్‌లో బీఫార్మసీ పూర్తి చేసిన శ్రావణ్‌ అమెరికాలో మాస్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఎంఎస్‌) చేయడానికి 2014లో వెళ్లాడు. 2016లోనే ఎంఎస్‌ పూర్తి చేసినా.. డబుల్‌ ఎంఎస్‌ కోసం అక్కడే ఉండిపోయాడు.

ఈస్టర్‌ సందర్భంగా ఈనెల 19న (భారత కాలమాన ప్రకారం 20వ తేదీ) స్నేహితులతో కలిసి ఫ్లోరిడా ప్రాంతంలోని డెస్టిన్‌ బీచ్‌కు వెళ్లాడు. సరదా కోసం సముద్రంలో దిగగా.. అలల వేగానికి కొట్టుకుపోయాడు. అక్కడే ఉన్న స్నేహితులు వెంటనే అక్కడి పోలీసులకు సమాచారం అందించారు. స్పందించిన వారు గాలింపు చర్యలు చేపట్టారు. ఆచూకీ లభించకపోవడంతో అక్కడి పోలీసులు శ్రావణ్‌ గల్లంతైనట్లు ఇక్కడ ఉంటున్న తల్లిదండ్రులకు ఫోన్‌లో సమాచారం అందించారు. మంగళవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఫోన్‌చేసి శ్రావణ్‌ చనిపోయినట్లు నిర్ధారించారు. 

అదే చివరి ఫోన్‌కాల్‌..
రాజం రెండో కొడుకు రవికుమార్‌ వరంగల్‌లో ఇరిగేషన్‌ శాఖలో డీఈగా పనిచేస్తున్నాడు. ఆయన కుమార్తె సాత్విక పుట్టినరోజు కావడంతో రాజం, మాలతి మూడురోజుల క్రితం వరంగల్‌కు వెళ్లారు. శ్రావణ్‌ తన తల్లిదండ్రులతో ఆదివారం ఉదయం ఫోన్‌లో మాట్లాడాడు. యోగా క్షేమాలు తెలుసుకున్నాడు. కొన్ని గంటల వ్యవధిలోనే శ్రావణ్‌ విగతజీవి అయ్యాడన్న వార్త విని పించగానే.. వారి శోకానికి అంతులేకుండా పోయింది.  శ్రావణ్‌ మృతిచెందాడన్న వార్తతో అశోక్‌నగర్‌లో తీవ్రవిషాదఛాయలు అలుముకున్నాయి.

మూడురోజుల తరువాతే చివరిచూపు
శ్రావణ్‌ మృతదేహం బెల్లంపల్లికి చేరుకోవడానికి మరోమూడు రోజులు పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికా లీగల్‌ వ్యవహారాలు పూర్తయ్యాకే శవాన్ని భారత్‌కు పంపనున్నారు. ప్రస్తుతం మృతదేహాన్ని అక్కడి ఆస్పత్రిలో భద్రపర్చి ఉంచినట్లు సమాచారం. కొడుకు మృతదేహం కోసం ఆతల్లిదండ్రలు, కుటుంబ సభ్యులు తీవ్రంగా రోదిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement