ఢాంకాన్‌పల్లెలో ఉద్రిక్తత

The Two Sides Friction Led To The Arrest Of The Police - Sakshi

ఇరు వర్గాల మధ్య ఘర్షణ

రాళ్లు, సీసాలతో పరస్పరం దాడులు

పోలీసుల రంగ ప్రవేశంతో పరిస్థితి అదుపులోకి

ఖాజీపేట : ఢాంఖాన్‌పల్లెలో ఆదివారం ఉద్రిక్తత నెలకొంది. ఇరు వర్గాల వారి రాళ్లు, గాజుసీసాల దాడులతో గ్రామం దద్దరిల్లింది. చివరకు రెండు వర్గాలకు చెందిన వారు గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఢాంఖాన్‌పల్లెలో గంగినాయుడు, గంగయ్య రెండు గ్రూపులుగా ఉన్నారు. వారికి కొంత కాలంగా రాజకీయ విభేదాలు ఉన్నాయి. పెద్ద గంగమ్మ ఆలయం విషయంలో తీవ్ర రూపం దాల్చాయి. బోనాల జాతర జరిగే విషయమై గ్రామస్తుల మధ్య మూడు వారాల కిందట చర్చ జరిగింది. ముందు గ్రామంలోని వారు ఎవరు వస్తే వారు గంగమ్మకు బోనాలు పెట్టుకోవచ్చని గంగినాయుడు వర్గం వాదించింది. కొంత కాలంగా తామే మొదటి సారిగా బోనాలు పెడుతున్నామని, ఇది ఆనవాయితీగా వస్తోందని, తరువాత ఎవరైనా పెట్టుకోవచ్చునని గంగయ్య వర్గం వారు వాదించారు.

గంగమ్మ వద్ద మీ పెత్తనం ఏమిటంటూ ఇరు వర్గాల వారు వాగ్వాదానికి దిగారు. చిన్న పాటి గొడవ జరిగింది. వెంటనే మైదుకూరు రూరల్‌ సీఐ హనుమంతునాయక్‌ జోక్యం చేసుకుని పరిస్థితి సర్దుబాటు చేశారు. జాతరను ప్రశాంతంగా చేసుకోవాలని సీఐ చెప్పారు. బోనాలు ఇంటి వద్దనే పెట్టుకుని, ఆలయంలో పూజారి ద్వారా అమ్మవారికి పూజలు చేసి వెళ్లాలి, ఎవరూ ఆలయం వద్ద బోనాలు పెట్టవద్దని ఆయన సూచించారు. దీంతో గ్రామంలో జాతర జరగలేదు. 

దారి విషయమై గొడవ
ఇరు వర్గాల వారు అన్మదమ్ములే కావడంతో.. ఇరువురి మధ్య రహదారిలో రాకపోకల సమస్య కొత్తగా బయటకు వచ్చింది. సర్వే నంబర్‌ 236లో 1.08 సెంట్ల స్థలం పూర్వం ముగ్గురు పెద్దలకు భాగాలు ఉన్నాయి. తర్వాత వారి పిల్లలు సుమారు 58 సెంట్లçను భాగాలుగా పంచుకుని రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. తాజాగా దారి విషయం అంటూ శనివారం రాత్రి గొడవకు దిగారు. ఇరు వర్గాల వారు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

తిరిగి ఆదివారం ఉదయం 6.30 గంటల సమయంలో ఘర్షణకు దిగారు. రాళ్లు రువ్వుకున్నారు. బీరుబాటిళ్లలో పెట్రోలు పోసి దాడులకు పాల్పడ్డారు. గాజుసీసాలను వేసుకున్నారు. ఇళ్ల అద్దాలు పగులగొట్టుకున్నారు. ఈలలు, కేకలతో గ్రామం దద్దరిల్లింది. చుట్టుపక్కల వారు ఏం జరుగుతోందో అనే ఆందోళనతో ఇంటికి తాళాలు వేసుకుని లోపల బిక్కుబిక్కుమంటూ గడిపారు. గంటకు పైగా ఘర్షణ జరిగింది.

పోలీసుల పహారా
గొడవపై గ్రామస్తులు ఖాజీపేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే స్టేషన్‌లో ఎవరూ లేకపోవడం.. అంతా బి.మఠంలో ప్రత్యేక బందోబస్తుకు వెళ్లడంతో సమయానికి పోలీసులు రాలేకపోయారు. వెంటనే స్పందించిన మైదుకూరు రూరల్‌ సీఐ హనుమంతునాయక్‌ ఉన్న కొద్ది మందితో అక్కడికి చేరుకుని పరిస్థితి అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. మైదుకూరు డీఎస్పీ శ్రీనివాసులు, రూరల్‌ సీఐ వెంటేశ్వర్లు వచ్చి ఆందోళనకారులను తరిమివేసి గ్రామం మొత్తం పోలీసుల అదుపులోకి తీసుకున్నారు.

ఇరువర్గాలకు చెందిన 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. గ్రామంలో పోలీస్‌ పికెట్‌ ఏర్పాటు చేశారు. ఇరు వర్గాల ఫిర్యాదుల మేరకు మొత్తం 50 మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇరు వర్గాలకు చెందిన అనీల్‌కుమార్, రాముడు, సింగరయ్య రెడ్డయ్య, వెంకటేష్, రామయ్య, పొట్టిరామయ్య, గంగయ్య, గంగామోహన్, కృష్ణయ్యకు గాయాలు కాగా.. కడప రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top