రాజధానిలో తండ్రీ కొడుకుల హత్య | Two People Were Murdered By Unknown Persons In Mangalgiri | Sakshi
Sakshi News home page

మంగళగిరిలో దారుణం

Dec 22 2018 5:29 PM | Updated on Dec 23 2018 7:18 AM

Two People Were Murdered By Unknown Persons In Mangalgiri - Sakshi

లక్ష్మయ్య, సురేష్‌ (ఫైల్‌)

కురగల్లు (మంగళగిరి)/తాడేపల్లి రూరల్‌: రాజధాని అమరావతి ప్రాంతంలో దారుణం జరిగింది. మంగళగిరి మండలం కురగల్లు, నీరుకొండలో పొక్లెయిన్‌ యజమాని, అతని కుమారుడిని కిరాతకంగా హతమార్చిన డ్రైవర్ల ఉదంతంఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం మేలవాయి గ్రామానికి చెందిన వేముల లక్ష్మయ్య (48), సురేష్‌ (25) రాజధాని ప్రాంతంలో సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు నిర్మాణం కోసం తమ పొక్లెయిన్‌ అద్దెకు ఇచ్చారు. నిడమర్రు గ్రామంలో 14 సీడ్‌ యాక్సెస్‌ రోడ్డులో పనులు చేయిస్తున్నారు. పొక్లెయిన్‌కు జార్ఖండ్‌ రాష్ట్రానికి చెందిన నరేష్‌ ముందుగా వచ్చి డ్రైవర్‌గా చేరాడు. ఆతర్వాత నరేష్‌ పేరుతో ఉన్న మరో వ్యక్తి ఆ రాష్ట్రం నుంచే వచ్చి డ్రైవర్‌గా పనికి కుదిరాడు. అయితే పొక్లెయిన్‌ ఆయిల్‌ను డ్రైవర్లు అమ్ముకుంటున్నారని గ్రహించిన యజమానులు వారిని మందలించారు. అమ్ముకున్న ఆయిల్‌ డబ్బులు జీతాలలో కట్‌ చేస్తామంటూ హెచ్చరించారు. దీంతో డ్రైవర్లు యజమానులపై కక్ష పెంచుకున్నారు.

ఈ నెల 14న యజమానులను డ్రైవర్లు డబ్బులు అడగ్గా.. ఆయిల్‌ అమ్ముకున్న వాటికి జీతాలు సరిపోయాయని చెప్పారు. దీంతో డ్రైవర్లు, యజమానులకు మధ్య వాగ్వాదం జరిగింది. వివాదం ముదిరి డ్రైవర్లు ఇరువురితో మరొకరు కలిసి యజమానులైన తండ్రీ కొడుకులను హత్య చేశారు. ఆ ఘోరం బయటపడకుండా ఉండేందుకు అక్కడే రోడ్డులో పెద్ద గోయి తీసి మృతదేహాలను అందులో పాతిపెట్టారు. లక్ష్మయ్య, సురేష్‌ వద్ద ఉన్న డబ్బు, సెల్‌ఫోన్‌లను తీసుకుని దుండగులు పరారయ్యారు.  స్వగ్రామంలో ఉన్న భార్య, చిన్న కుమారుడికి ప్రతి రోజూ లక్ష్మయ్య ఫోన్‌ చేసి క్షేమ సమాచారాలు తెలుసుకునేవాడు. అయితే ఈ నెల 15వ తేదీ నుంచి ఫోన్‌ రాకపోవడంతో పాటు రెండు ఫోన్‌లు స్విచ్ఛాఫ్‌ కావడంతో అనుమానం వచ్చిన లక్ష్మయ్య భార్య వెంకాలమ్మ చిన్న కుమారుడు హరీష్‌ మంగళగిరి వచ్చారు. హరీష్‌ 19వ తేదీ కాంట్రాక్టు సంస్థ మేఘా కన్‌స్ట్రక్షన్‌ కంపెనీకి వచ్చి విచారించాడు.

ఎక్కడ వెతికినా తండ్రి, సోదరుడి జాడలేకపోవడం, డ్రైవర్ల ఆచూకీ కూడా లేకపోవడంతో హరీష్‌ మంగళగిరి రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. లక్ష్మయ్య డ్రైవర్లను మందలించిన విషయం ఆయన భార్య పోలీసులకు వివరించింది. అప్పట్లో జోరున వర్షం కురవడంతో పోలీసులు దర్యాప్తు సాగించలేదు. శనివారం లక్ష్మయ్య, సురేష్‌ పని చేసిన ప్రాంత పరిసరాలు చదునుగా ఉండటంతో అనుమానం వచ్చిన తోటి పని వారు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో మంగళగిరి రూరల్‌ సీఐ బాలాజీ సంఘటన స్థలానికి చేరుకొని అక్కడ తవ్వకాలు నిర్వహించారు. అక్కడ తొలుత లక్ష్మయ్య శరీర భాగాలు బయటపడ్డాయి. తర్వాత దుస్తులను బట్టి మృతదేహాలను గుర్తించారు. సంఘటన స్థలానికి చేరుకున్న జిల్లా అడిషనల్‌ ఎస్పీ లక్ష్మీనారాయణ చేరుకుని వివరాలు సేకరించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement