ఇద్దరిని కబళించిన లారీ

Two Men Died in Lorry Accident Krishna - Sakshi

మరో మహిళకు తీవ్ర గాయాలు

వరిగడ్డి లోడు ట్రాక్టర్‌ను ఢీకొట్టడంతో ఘటన

కె.అగ్రహారం (జగ్గయ్యపేట) : వరిగడ్డి లోడు ట్రాక్టర్‌ను లారీ ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా ఓ మహిళకు తీవ్ర గాయాలైన ఘటన గ్రామంలో శనివారం అర్థరాత్రి చోటు చేసుకుంది. సేకరించిన సమాచారం మేరకు మండలంలోని ధర్మవరప్పాడు తండాకు చెందిన రూపావత్‌ లాలు (40), గుగులోతు బాలాజీ (31), బాణావత్‌ బాలనాగమ్మ తెలంగాణలోని నల్గొండ జిల్లా జాన్‌పాడులో వరి గడ్డి కొనుగోలు చేసేందుకు ట్రాక్టర్‌పై వెళ్లారు. వరి గడ్డి కొనుగోలు చేసుకుని ట్రాక్టర్‌పై తిరిగి వస్తున్నారు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో గ్రామంలోని రెండవ మలుపు వద్దకు వచ్చేసరికి రామాంజనేయ ట్రాన్స్‌పోర్టుకు చెందిన లారీ జగ్గయ్యపేట నుంచి సిమెంట్‌ కర్మాగారానికి వెళ్తోంది. లారీ వేగంగా ట్రాక్టర్‌ను ఎదురుగా ఢీకొట్టటమే కాకుండా ట్రాక్టర్‌ ఇంజిన్‌పైకి ఎక్కింది. దీంతో ట్రాక్టర్‌ నడుపుతున్న డ్రైవర్‌ లాలు ఇంజిన్‌ కింద పడి అక్కడికక్కడే మృతి చెందగా పక్కనే కూర్చున్న బాలాజీ, నాగమ్మ రోడ్డుపై పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. అటుగా వెళ్తున్న కొందరు 108కు సమాచారమివ్వటంతో జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్య సేవల నిమిత్తం వారిని విజయవాడ ఆంధ్ర ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలాజీ ఆదివారం ఉదయం మృతి చెందాడు. బాలనాగమ్మ పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం జరిగిన ప్రాంతం భయానకంగా మారింది. ప్రమాద ప్రాంతంలో చేతికందే ఎత్తులో 11 కేవీ విద్యుత్‌ తీగలుండటం గమనార్హం. చిల్లకల్లు ఎస్‌ఐ చిరంజీవి ఘటనా స్థలాన్ని పరిశీలించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఒకే కుటుంబానికి చెందినవారే..
మృతి చెందిన లాలు, బాలాజీ, బాలనాగమ్మ ఒకే కుటుంబానికి చెందిన వారు. వీరంతా వ్యవసాయ పనులు చేస్తూ జీవనం సాగిస్తుంటారు. డ్రైవర్‌గా పని చేస్తున్న లాలు ఇటీవల ట్రాక్టర్‌ కొనుగోలు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. మరో మృతుడు బాలాజీ కూలీ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. మృతులకు భార్య, పిల్లలు ఉన్నారు.

ధర్మవరప్పాడు తండాలోవిషాదఛాయలు..
రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి చెందటంతో పాటు మరొకరు తీవ్ర గాయాల పాలవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పశువులకు వరి గడ్డి కొనుగోలు చేసేందుకు వెళ్లి తిరిగి వస్తుండగా లారీ రూపంలో మృత్యువాత పడటంతో గ్రామస్తులను సైతం కంట తడి పెట్టించింది. జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రి వద్ద మృతదేహాలను వైఎస్సార్‌ సీపీ జిల్లా పంచాయతీరాజ్‌ కమిటీ కన్వీనర్‌ తన్నీరు నాగేశ్వరరావు సందర్శించి నివాళులర్పించారు. పార్టీ విజయవాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను మృతుల కుటుంబాలను ఫోన్‌లో పరామర్శించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top