కన్నీటి బావి

Two Children Deceased in Well While Drinking Water in Krishna - Sakshi

బావిలో పడి ఇద్దరు చిన్నారుల మృతి

మంచినీరు తాగే ప్రయత్నంలో..

చేపలు పట్టేందుకు వెళ్లిన వైనం

రెండు కుటుంబాలలో విషాదం

కలలకు ప్రతిరూపం వాళ్లు.. ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నారు.. తల్లీదండ్రులకు ఆశలు నెరవేర్చే∙సారథులుగా నడుస్తున్నారు.. మంచి చదువు చదివించాలని తాపత్రయం.. కూలీనాలీ చేసుకుని ఉన్నతులుగా చూడాలని ఆశ.. సాఫీగా సాగుతున్న కుటుంబాల్లో ఓ కుదుపు. పిడుగులాంటి వార్త. ఆశల సౌధం కూలిపోయింది.. ఇప్పటి వరకు కబుర్లు చెప్పిన చిన్నారులు కనిపించడం లేదు.. చలనం లేని శరీరాలను చూసి  ‘తల్లి’డిల్లిపోయారు.. రెండు కుటుంబాల్లో విషాదం. ఈ ఘటన కలగరలో చోటుచేసుకుంది.

విస్సన్నపేట(తిరువూరు): ఇద్దరు చిన్నారులు బావిలో మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది.   వివరాలు.. మండలంలోని కలగర పంచాయతీ రామచంద్రాపురానికి గ్రామానికి చెందిన ముగ్గురు చిన్నారులు సమీపంలోని రావికుంట చెరువు వద్దకు చేపల పట్టుకునేందుకు వెళ్లారు. ముగ్గురిలో దుబ్బాకు శాంతకమలాకర్‌ కుమారుడు కౌశిక్‌(8), సిరెల్లి జక్రయ్య కుమార్తె శ్రావణి(12), జస్వంత్‌ ఉన్నారు. ముగ్గురు సరదాగా చెరువులో చేపలు పట్టేందుకు ప్రయత్నించారు. మధ్యలో వీరికి దాహం వేసింది. వెంటనే సమీపంలో ఉన్న వ్యవసాయ పొలంలో ఉన్న చిన్న బావి గుర్తుకు వచ్చింది. వెంటనే ముగ్గురు బయలుదేరి వెళ్లారు. అక్కడకు వెళ్లిన తరువాత ముగ్గురు చేతికి అందె ఎత్తులో ఉన్న నీటిని తాగేందుకు ప్రయత్నించారు. కౌశిక్, శ్రావణి ఒక వైపునే ఉన్నారు. ఈ క్రమంలో బావి అంచు జారిపడిపోయింది. ఇద్దరు బావిలో పడిపోయారు. గమనించిన తోడుగా వచ్చిన జస్వంత్‌ పెద్దగా కేకలు వేయడంతో సమీపంలో పొలం పనులు చేసుకుంటున్న వారు వచ్చి బయటికి తీశారు. అప్పటికే చిన్నారులు ఇద్దరు మృతి చెందినట్లు గుర్తించారు. 

కుటుంబాల్లో విషాదం
సిరెల్లి జక్రయ్య, సువార్తకు ఇద్దరు కుమార్తెలు. శ్రావణి ఏడో తరగతి చదువుతోంది. శ్రావణి అక్క పదో తరగతి చదువుతోంది. వీరిద్దరు సమీపంలో గురుకుల పాఠశాలలో చదువుతున్నారు. జక్రయ్య కొంతకాలం కిందట మృతి చెందగా తల్లి ఇద్దరు పిల్లలను కూలీ పనులు చేసుకుంటూ చదివిస్తోంది. విషాద ఘటన తెలుసుకున్న తల్లి కుప్పకూలిపోయింది. కౌశిక్‌ తండ్రి దుబ్బాకు శాంతకుమలాకర్‌ వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.    కౌశిక్‌కు సోదరి ఉంది.

కేసు నమోదు..
ప్రమాద ఘటన తెలుసుకున్న వెంటనే ఏఎస్‌ఐ ఏఎస్‌ఐ సత్యనారాయణ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. స్థానికులను విచారించారు. ప్రమాదం జరిగిన నేపథ్యంతో పాటు బావి ఉన్న పొలం రైతులతోనూ మాట్లాడారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ తెలిపారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top