కుంభకోణం సెగ, ఇద్దరు ఎగ్జిక్యూటివ్‌లకు షాక్‌!

 Two AirAsia Chiefs Step Aside As Probe Into Airbus Bribery Scandal Widens - Sakshi

అవినీతి, లంచాల ఆరోపణ 

ఎయిర్‌ ఏషియా ఎయిర్‌బస్‌ వివాదంలో దర్యాప్తు ముమ్మరం

సీఈవో టోనీ ఫెర్నాండెజ్, కమారుద్దీన్‌ మారన్‌ తొలగింపు

కౌలాలంపూర్ : మ‌లేషియ‌న్ ఎయిర్‌లైన్స్ సంస్థ‌ ఎయిర్‌ ఏషియా కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.  అవినీతి, లంచాల ఆరోపణలపై  ఫ్రాన్స్, బ్రిటన్, అమెరికా దర్యాప్తు  ముమ్మరమవుతున్న నేపథ్యంలో సంస్థ సీఈవో టోనీ ఫెర్నాండెజ్ తాత్కాలికంగా పదవినుంచి తప్పుకున్నారు. ఫెర్నాండెజ్‌తో పాటు, విమానయాన సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌ కమారుద్దీన్‌ మెరానున్ కూడా పదవినుంచి వైదొలగుతున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఈ నిర్ణయం వెంటనే అమలులోకి వస్తుందనీ, రెండు నెలల కాలానికి లేదా కంపెనీ సరిపోతుందని భావించే సమయానికి వారు ఎగ్జిక్యూటివ్‌ పదవులకు దూరంగా ఉంటారని ఎయిర్ ఏషియా ప్రకటనలో తెలిపింది. అలాగు గ్రూపు ప్రెసిడెంట్‌ కనకలింగంను తాత్కాలిక సీఈవోగా నియమించింది. అనుమానాస్పద లంచాలు, అవినీతిపై బహిరంగ దర్యాప్తుకు సంబంధించి ఫ్రెంచ్, బ్రిటిష్, అమెరికన్ అధికారులతో ఒప్పందం చేసుకున్నామని ఎయిర్‌బస్‌ గత వారం ప్రకటించిన నేపథ్యంలో  ఎయిర్‌ఏషియా ఈ నిర్ణయాన్ని తీసుకుంది. 


మధ్యంతర సీఈవో కనకలింగం

యూరోపియన్ విమానాల తయారీ సంస్థ ఎయిర్‌బస్ నుంచి 180 విమానాల కొనుగోలు, ఎయిర్ ఏషియాఎక్స్ క్రీడా జట్టుకు స్పాన్సర్‌షిప్‌గా ఎయిర్‌బస్ నుండి సుమారు 50 మిలియన్ డాలర్ల లంచం తీసుకున్నట్లు ఆరోపణలపై మలేషియా అవినీతి నిరోధక కమిషన్(ఎంఏసీసీ) తెలిపింది. దేశానికి వెలుపల ఎక్కడైనా పౌరులు లేదా శాశ్వత నివాసితులు చేసిన అవినీతి చర్యలపై దర్యాప్తు చేసే అధికారం ఉందని శనివారం ప్రకటించింది. ఎయిర్ బస్-ఎయిర్ ఏషియా వివాదంలో యూకే అధికారులతో సంప్రదింపులతోపాటు ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నామని ఎంఏసీసీ చీఫ్ కమిషనర్ లతీఫా కోయా చెప్పారు.

మరోవైపు యూరోపియన్ తయారీదారుతో చర్చలు జరపడానికి మధ్యవర్తులను ఎప్పుడూ ఉపయోగించలేదని ఎయిర్‌ ఏషియా పేర్కొంది. ఈ ఆరోపణలపై విచారించేందుకు కంపెనీ బోర్డు ఒక దర్యాప్తు బృందాన్ని నియమించింది. ఈ  నేపథ్యంలో సలహాదారులుగా, ఫెర్నాండెజ్‌, మెరానున్కు బోర్డులో కార్యనిర్వాహక అధికారం ఉండదని ఎయిర్లైన్స్ తెలిపింది. తాముగానీ, సీఈవో ఫెర్నాండెజ్‌, మెరానున్గానీ ఎలాంటి అవినీతికి పాల్పడలేదని వివరణ ఇచ్చింది.  ఈ వార్తల నేపథ్యంలో  ఎయిర్ ఏషియా మరియు ఎయిర్ ఏషియా ఎక్స్ షేర్లు పడిపోయాయి. కాగా పౌర,  సైనిక ఒప్పందాలను పొందటానికి ఎయిర్‌ ఏషియా కంపెనీ మధ్యవర్తులను ఉపయోగించిందన్న ఆరోపణలపై  బ్రిటీష్ మోసపూరిత నిరోధక సంస్థ ఎస్‌ఎఫ్‌వో (సీరియస్ ఫ్రాడ్ ఆఫీస్)  2016 లో దర్యాప్తు ప్రారంభించింది.

Election 2024

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top